- ఈనెల 16 నుంచి 20 వరకు జాతర
- భారీగా తరలిరానున్న భక్తులు
సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు జాతర నిర్వహణలో భాగంగా నేడు దిష్టిపూజ జరుపనున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు శ్రీలింగమంతులస్వామి జాతర రెండేండ్లకోసారి జరుగుతుంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జాతర కొనసాగుతుంది. ఈ జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందు మధుమాసం, అమావాస్య ఆదివారం రాత్రి దిష్టికుంభాలు పోయడం, దిష్టి పూజ చేయడం ఆనవాయితీ. అనంతరం జాతర పనులను ప్రారంభిస్తారు.
నేడు దిష్టి పూజ..
యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే పెద్దగట్టు జాతరకు నేడు దిష్టి పూజ నిర్వహించడంతో జాతర మొదలవుతుంది. తల్లి, పిల్ల గొర్రెను బలిచ్చి నైవేద్యం (బోనం)తో బలిముద్దను తయారు చేసి పరిసరాల్లో ఎలాంటి అపశకనాలు జరగకుండా సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు. దిష్టిపూజ అనంతరం అక్కడికి చేరుకున్న లింగమంతులస్వామి భక్తులకు మరుసటి రోజు బలి ఇచ్చిన గొర్రె, పిల్ల మాంసంతో వండిన ఆహారాన్ని భక్తులకు పెడుతారు.
కేసారంకు దేవరపెట్టె..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయిపాలెం నుంచి దేవరపెట్టెను యాత్రగా కేసారం తీసుకురానున్నారు. చీకటాయిపాలెంలో ప్రత్యేక పూజల అనంతరం పూజారులు సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించిన దేపరపెట్టెకు కేసారం చేరేవరకు ఆయా ప్రాంతాల్లోని యాదవులు ప్రత్యేకంగా స్వాగతం పలికి దర్శించుకుంటారు. మరుసటి రోజు దిష్టిపూజా కార్యక్రమానికి పెద్దగట్టుకు తీసుకొస్తారు.
చరిత్ర ప్రకారం..
పెద్దగట్టు జాతరను గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. ఇక్కడ లింగమంతులస్వామి, చౌడమ్మ దేవతలు కొలువుదీరుతారు. వీరి పేరిట రెండేండ్లకోసారి ఈ పండుగను నిర్వహిస్తారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర మేడారం తర్వాత దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ప్రసిద్ధి చెందింది. ఈ జాతరను శివరాత్రికి ముందు నిర్వహించడం ఆనవాయితీ. ఐదు రోజులపాటు ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో యాదవులు కీలకపాత్ర పోషిస్తారు. ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతారు.
ఈ జాతరను 16వ శతాబ్దం నుంచి జరుపుకొంటున్నారు. జాతరకు 10 రోజుల ముందుగానే కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. లింగమంతులస్వామి,- చౌడమ్మ దేవత, అనేక ఇతర విగ్రహాలను కలిగి ఉన్న మతపరమైన పెట్టె 'దేవరపెట్టె' దురాజ్ పల్లి జాతర వేడుకకు కీలకమైంది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం సంప్రదాయబద్ధంగా ఈ పెట్టెను పంపుతోంది. తర్వాత కేసారం గ్రామంలోని చౌవడియా యాదవ్ ఇంటి నుంచి దేవర పెట్టె మార్చబడుతుంది. జాతర తొలిరోజు తెల్లవారుజమున ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు.
పెద్దగట్టు జాతరకు రూ.5 కోట్లు మంజూరు
రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరైన చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతులస్వామి జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతర ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కొనసాగనుంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో జాతరలో మౌలిక సదుపాయాలతోపాటు శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నారు. నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు ఆలయ చైర్మన పొలేబోయిన నర్సయ్య యాదవ్ కృతజ్ఙతలు తెలిపారు.