
సూర్యాపేట, వెలుగు : తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే పెద్దగట్టు జాతర సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అతిపెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతులస్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర దాదాపు 250 ఏండ్ల నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
పెద్దగట్టు జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇది భారతదేశంలోని యాదవుల ఏకైక జాతరగా భావిస్తారు. ఈ ఏడాది జాతరకు దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
గంపల ప్రదక్షిణతో జాతర షురూ..
లింగమంతులస్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభంకానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఐదో రోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది.
మకర తోరణం తరలింపు..
లింగమంతులస్వామికి అలంకరించే మకర తోరణాన్ని సూర్యాపేట గొల్ల బజార్ నుంచి పెద్దగట్టు మీదకు తరలించారు. ఆదివారం రాత్రి లింగమంతులస్వామిని ప్రతిష్టించిన అనంతరం సాంప్రదాయబద్ధంగా మకర తోరణాన్ని స్వామివారికి అలంకరిస్తారు.
శనివారం గొల్ల బజార్ నుంచి బేరీలు, కటారులు, కత్తుల విన్యాసాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మకర తోరణాన్ని తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు..
లింగమంతులస్వామి జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. గుట్ట చుట్టూ శానిటైజేషన్ నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం 8 జోన్లను ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో 130 మంది సిబ్బంది చొప్పున 390 మందిని నియమించారు. జాతర ప్రాంతంలో 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 27 మంది డాక్టర్లతో కలిపి మొత్తం 191 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు.
జాతరలో విద్యుత్ అంతరాయం లేకుండా 9 లొకేషన్లను ఏర్పాటు చేసి 110 మంది విద్యుత్ అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.