- క్వారీ లీజుపై ప్రజాభిప్రాయ సేకరణతో రైతుల ఆవేదన
శాయంపేట, వెలుగు: ‘ఉన్న క్వారీలతోనే ఇబ్బందులు పడ్తున్నం.. వ్యవసాయం చేయాలంటే భయమేస్తుంది. మీ కాళ్లు మొక్కుతం. క్వారీలు పెట్టకండి’ అంటూ హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక రైతులు మంగళవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆవేదన చెందారు. రెవెన్యూ పరిధిలోని 633/1 సర్వేనంబర్‌లో 7.81 హెక్టార్లలో క్వారీ ఏర్పాటుకు 20 ఏళ్ల లీజుకు శ్రీవెంకటేశ్వర స్టోన్‌క్రషర్ మేనేజ్మెంట్ దరఖాస్తు చేసుకుంది.
దీంతో కాలుష్యనియంత్రణమండలి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. రైతులు ఇక్కడ క్వారీ ఏర్పాటు చేయద్దని వేడుకున్నారు. గతంలో ఉన్న క్వారీల యజమానులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో క్వారీని ఏర్పాటు చేస్తే చావే శరణ్యమన్నారు. క్వారీ ఏర్పాటు చేయద్దని ఇప్పటికే 14 వరకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణలో 20 రిప్రజెంటేషన్ లు, 25 మంది అభిప్రాయాలను రాష్ట్ర మంత్రిత్వ శాఖకు పంపిస్తామని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఈఈ సునీత తెలిపారు.