పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల్లో ధరణి సమస్యలు క్లియర్!

పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల్లో ధరణి సమస్యలు క్లియర్!
  • వెలుగు ఇంటర్వ్యూలో పెద్దపల్లి కలెక్టర్​ కోయ శ్రీహర్ష
  • సర్కార్​ గైడ్​ లైన్స్​ ప్రకారం పోడు సమస్య పరిష్కారం
  • విద్య, వైద్యంపై ప్రత్యేక ప్రణాళిక
  • అన్నిరంగాల్లో పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కృషి

పెద్దపల్లి, వెలుగు :పెద్దపల్లి జిల్లాలో పెండింగ్​లో ఉన్న ధరణి సమస్యలను 10 రోజుల్లో క్లియర్ చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐఎఎస్​ల  బదిలీల్లో భాగంగా పెద్దపల్లి కలెక్టర్​గా వచ్చిన ఆయన ‘వెలుగు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

కనీసం సగానికి పైగా అయినా..!

ధరణి సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను సమాయత్తం చేశా. జిల్లా వ్యాప్తంగా 4,200 పైచిలుకు ధరణి పెండింగ్​ అప్లికేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి, ధర్మారం మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కనీసం సగానికి పైగా అయినా పరిష్కరిస్తాం. ఒక్కో మండలానికి డీటీ, ఎస్ఏ లాంటి అధికారులను ముగ్గురిని నియమించాం. వీరంతా కేవలం ధరణి సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తారు. 

ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు

ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బడి బాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆసక్తి పెంచాలే సర్కార్​ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేశాం. స్కూళ్లలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే దిశగా సాగుతున్నాం. ప్రత్యేక ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా బడులను, విద్యార్థులను తీర్చిదిద్దుతాం.

ఆస్పత్రుల్లో కొరత లేకుండా చర్యలు

పెద్దపల్లి జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించాం. ఆస్పత్రులకు సరిపోయే వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.  వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆస్ప్రతుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతాం. 

ఒకట్రెండు రోజుల్లో శానిటేషన్​పై రివ్యూ

గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య​సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తడి,  పొడిచెత్తను వేరుచేసి సేకరిస్తున్నాం. మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో కూడా ప్రజలకు తడిపొడి చెత్త మీద అవగాహన పెంచాం. అలాగే చెత్త సేకరణకు కావాల్సిన వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఒకటి, రెండు రోజుల్లో మున్సిపల్​, గ్రామపంచాయతీ అధికారులతో శానిటేషన్​పై రివ్యూ నిర్వహించి సమస్య రాకుండా చూస్తాం

పోడు సమస్య పరిష్కారానికి కృషి

పోడు భూముల పట్టాల కోసం సర్కార్​ ఆదేశాలతో అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. పోడు భూముల సమస్య అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. పోడు భూములపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు లేవు. సర్కార్​ నుంచి గైడ్​ లైన్స్​రాగానే సమస్యను పరిష్కారానికి కృషి చేస్తా.  

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును కఠినంగా అమలు చేస్తాం.. 

పెద్దపల్లి జిల్లాలోని మానేరులో ఇసుక తరలింపుపై గ్రీన్ ట్రిబ్యునల్​ ఇచ్చిన తీర్పును కఠినంగా అమలయ్యేలా చూస్తాం. ఇసుక అవసరమున్న వాళ్లు బ్లాక్​ మార్కెట్​ను ఆశ్రయించకుండా,  సాండ్​ ట్యాక్సీ విధానం ద్వారానే పొందేలా అవగాహన కల్పిస్తాం. అలాగే అనుమతులకు మించి మట్టి తరలింపు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం.