గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతలను ఈనెల 9 లోపు పూడ్చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్పొరేషన్ ఏరియాలోని శాలపల్లి రోడ్డు, బస్టాండ్, కల్యాణ్‌నగర్ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై గుంతలను వెట్ మిక్స్, డస్ట్ తో పూడ్చివేయాలని, కార్పొరేషన్లో ఎక్కడా రోడ్లపై గుంతలు కనిపించొద్దన్నారు.
స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నీటి వనరుల పరిశుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో 300 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని లైబ్రరీని సందర్శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అధికారులు ఉన్నారు.