గని కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా : గడ్డం వంశీకృష్ణ

గని కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా : గడ్డం వంశీకృష్ణ
  •     పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు : తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తానని పెద్దపల్లి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. శనివారం సింగరేణి రీజియన్​పరిధిలోని ఓపెన్​కాస్ట్​3 ప్రాజెక్టు​కృషి భవన్​ వద్ద ఐఎన్టీయూసీ, కాంగ్రెస్​ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ​అని గుర్తుచేశారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని కేంద్రం ద్వారా ఇప్పించి సంస్థను కాకా కాపాడారని చెప్పారు.

గడిచిన పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే మోదీ సర్కార్​ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తనను ఎంపీగా చేస్తే సింగరేణిలో కొత్త బొగ్గు బావులను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. కార్మికులకు ఇన్​కమ్​ట్యాక్స్​మినహాయింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. -రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​మాట్లాడుతూ..

రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వామి, బొంతల రాజేశ్, శంకర్ నాయక్, శంకర్, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, అక్రం, అక్బర్ అలి తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి, వెలుగు : వంశీని ఎంపీగా ఆశీర్వదిస్తే అభివృద్ధి జరిగేలా పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామి సన్నిధిలో ఆయనతో కలిసి వంశీ కృష్ణ ప్రత్యేక పూజలు చేసి ముడుపు కట్టారు.