
- భూ సర్వే చేసి మూడేళ్లు
- ఎఫ్‌పీయూలతో యువతకు ఉద్యోగాలొచ్చే చాన్స్
- గుర్తించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలేవి?
- లక్షల టన్నుల్లో వ్యవసాయ ఉత్పత్తులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లు ప్రతిపాదనల్లోనే ఉండిపోయాయి. గత ప్రభుత్వం 2022లో పెద్దపల్లి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ల్యాండ్ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు సూచించింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గతంలో చాలా వరకు ప్రభుత్వ భూములే ఉండేవి. గత ప్రభుత్వాలు వందల ఎకరాలు అర్హులైన పేదలకు పంచడంతో చివరకు 102 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కనీసం 400 ఎకరాలు ఒకే బిట్టుగా ఉండాలనేది పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు. దీంతో గత సర్కార్ ఆ ప్రక్రియను పక్కన పెట్టేసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త సర్కార్ ఏర్పాటైన తర్వాత యువతలో కొత్త ఆశలు చిగురించాయి. ఎఫ్‌పీయూలు ఏర్పాటైతే యువతకు ఉపాధి దొరికే చాన్స్ ఉంది. ఎఫ్‌పీయూలకు అనువైన వ్యవసాయం జిల్లాలో ఉంది. ఇప్పటికే లక్షల మెట్రిక్ టన్నుల్లో వరి ఉత్పత్తులు, వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పండుతున్నాయి.
బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలతో కూడిన డెయిరీ ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు సర్కార్ ప్రోత్సాహకాలు ఇస్తుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో రామగుండం ఇప్పటికే దేశంలోనే ఒక ప్రాధాన్యత కలిగిన ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరొందింది. మిగిలిన రెండు మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఆయిల్ ఫాం కంపనీ ఏర్పాటు చేయడానికి రూపకల్పన జరిగిపోయింది. అయితే సర్కార్ గుర్తించిన భూముల్లో అయినా ఇన్ఫ్రాక్ట్రక్చర్ ఏర్పాటు చేయకపోవడంతోనే పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదనే వాదన ఉంది.
సవాల్‌గా మారిన భూసేకేరణ
పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం భూసేకరణ చేయడం సర్కార్‌కు సవాల్ గా మారింది. ప్రభుత్వ భూములు లేకపోవడంతో అసైన్డ్ ల్యాండ్స్ కోసం అధికారులు ప్రయత్నం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో కబ్జాకు గురైన భూములు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిన అసైన్డ్ భూములను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్యూనిట్ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం దాదాపు 400 ఎకరాల భూమి ఒకే చోట కావాల్సి ఉంది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలలోని ముప్పిరితోట, ర్యాకల్ దేవ్ పల్లి గ్రామాల్లో అసైన్డ్ భూములను అధికారులు గుర్తించారు. కానీ ఆ భూములన్నీ గత ప్రభుత్వాలు వివిధ సామాజికవర్గాలకు ఇచ్చారు. మండలంలోని వివిధ సర్వే నంబర్లలో గతంలో దాదాపు 1200 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉందేదని చెప్తున్నారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అధికారులు సర్వే చేయగా అందులో 102 ఎకరాలు మాత్రమే అసైండ్ ల్యాండ్‌గా గుర్తించారు.
ఎఫ్పీయూకు కేంద్రమైతది...
పెద్దపల్లి జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్యూనిట్లకు కేంద్రం కానున్నదని పలువురు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ఒక హైవే మంథని నుంచి భూపాలపల్లి మీదుగా పొతుంది. మంచిర్యాల నుంచి మంథని నియోజకవర్గం ముత్తారం మండలం మీదుగా మరో 63 జాతీయ రహదారి పోతుండటంతో జిల్లా ఎఫ్‌పీయూలకు కేంద్రంగా మారుతుందని చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఏటా 2.50 లక్షల ఎకరాలకు పైగా వరి, మిర్చి, పసుపు, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ప్రస్తుతం ఆయిల్ ఫాం పంటలు సాగు అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 200 పైగా రైసు మిల్లులున్నాయి. రెండు పంటల్లో కలిపి లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఈ క్రమంలోనే అగ్రికల్చర్ ప్రొడక్షన్‌కు అనుబంధమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని యువత కోరుతున్నారు.