పెద్దపల్లి జిల్లాలో సర్కార్ భూముల గుర్తింపు సర్వే

పెద్దపల్లి జిల్లాలో  సర్కార్ భూముల గుర్తింపు సర్వే
  • కబ్జాలు గుర్తించి బోర్డులు పెడుతున్న ఆఫీసర్లు 
  • జిల్లాలో 33వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అంచనా
  • ప్రతి మండలంలో 60 నుంచి 70 ఎకరాలను గుర్తిస్తున్నట్లు అధికారుల వెల్లడి 
  • భూకబ్జాదారుల్లో టెన్షన్​

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో కబ్జా అయిన సర్కార్ భూములను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. కబ్జాలు గుర్తించి బోర్డులు పెడుతున్నారు. జిల్లాలో సుమారు 33వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా వేయగా.. ఆ భూమిలో చాలావరకు కబ్జాలకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

 ఇప్పుడు ఆ భూమిని తిరిగి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో 60 నుంచి 70 ఎకరాల కబ్జా భూముల లెక్క బయటపడుతోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు రైతుబంధు కోసం ఉన్న భూమి కన్నా ఎక్కువున్నట్లు రికార్డుల్లో ఎక్కించుకున్న వారిని గుర్తించి 
సరిచేస్తున్నారు. 

మెయిన్​ రోడ్ల పక్కనే కబ్జాలు ఎక్కువ

 కబ్జాలకు గురైన భూములన్నీ మెయిన్​ రోడ్ల పక్కనే ఉంటున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో పరిశ్రమలున్నాయి. అలాగే రాజీవ్​ రహదారిని ఆనుకొని ప్రధాన పట్టణాలు ఉండడంతో కబ్జాదారులు ఆ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. రెండు రోజుల కింద మంథని పట్టణానికి సమీపంలోని రెడ్డి చెరువు కబ్జాకు గురైందని, దళితులకు గతంలో ఇచ్చిన భూమి కబ్జాకు చేశారని కాకర్లపల్లి గ్రామానికి చెందిన దళితులు మంథని ఆర్డీవో ఆఫీసులో ఫిర్యాదు చేశారు.

దీంతో  రెవెన్యూ అధికారులు సర్వే  చేయగా.. సర్వే నంబర్ 633,634 లో 16 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి  కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దళితులకు గతంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన భూములను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. 

ఇప్పటి వరకు జరిగిన భూపరిరక్షణ సర్వేలో ప్రతీ మండలం నుంచి 60 నుంచి 70 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. కబ్జా చేసి, చెరువులో మోటార్లు పెట్టిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  సర్వేకు వచ్చిన అధికారులను రైతులు కోరుతున్నారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న భూములను రానున్న రోజుల్లో రాజీవ్​ యువవికాసం ద్వారా అర్హులైన చిరు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వనున్నట్లు
 తెలుస్తుంది.

కబ్జాదారుల్లో కలవరం

పకడ్బందీగా భూ సర్వే చేస్తుండడంతో కబ్జాదారుల్లో టెన్షన్​మొదలైంది. గతంలో అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆమోదం లేకుండా చాలా భూములు రిజిస్టరైనట్లు అధికారులు గుర్తించి ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు నోటీసులు కూడా ఇస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే రైతుబంధు ఎక్కువగా పొందాలనే ఆశతో ఉన్న భూమికంటే ఎక్కువగా ఉన్నట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న భూములను గుర్తించిన అధికారులు వాటిని సరిచేసే పనిలో పడ్డారు. ఇలా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోసం చేసి రైతుబంధు పైసలు తీసుకున్నందుకు ఎలాంటి చర్యలుంటాయోనని ఆందోళన చెందుతున్నారు.