![పెద్దపల్లి జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్](https://static.v6velugu.com/uploads/2025/02/officials-launch-action-plan-to-ensure-drinking-water-supply_me4xfUaDs7.jpg)
- సమ్మర్‌లో తాగునీటి కష్టాలపై అధికారులు ఫోకస్
- నిరంతర సప్లైకి యాక్షన్ ప్లాన్
- లీకేజీలు గుర్తించి రిపేర్లు చేయించేందుకు పక్కా ప్లాన్
- ఈనెల 12 వరకు కొనసాగనున్న సర్వే
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో సమ్మర్‌లో తాగునీటి సమస్యపై అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లాలోని భగీరథ, మున్సిపల్, పీఆర్ అధికారులు సమ్మర్‌యాక్షన్ ప్లాన్ పేరుతో ఈనెల 1నుంచి సర్వే ప్రారంభించారు. తొలుత 10వ తేదీ వరకు సర్వే చేయాలని నిర్ణయించగా.. మరో రెండు రోజులు పెంచారు.
ఈ సర్వేలో జిల్లాలోని తాగునీటి వనరులను గుర్తించనున్నారు. దీనిలో భాగంగా భగీరథ లీకేజీలను గుర్తించి రిపేర్లు చేస్తున్నారు. దీంతోపాటు బావులు, బోర్‌వెల్స్.. లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి నీటి కష్టాలు ఎదురవకుండా అధికారులు పక్కా ప్లాన్ చేస్తున్నారు.
నీటి వనరులపై ఫోకస్
జిల్లాలో రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, 266 జీపీలున్నాయి. వీటి పరిధిలో 681 వాటర్ ట్యాంకులు, దాదాపు 4 500 బోర్ వెల్స్, ట్యాపులు, 300 పైచిలుకు తాగునీటి బావులు ఉన్నాయి. ప్రస్తుతం వీటి స్టేటస్‌పై మిషన్‌భగీరథ, మున్సిపల్, జీపీ సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం పక్కాగా రిపోర్ట్ తయారుచేసి దాని అనుగుణంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
జిల్లాలో ప్రధాన తాగునీటి పథకాలైన భగీరథ మోటార్లు సక్రమంగా పనిచేస్తున్నాయా, పైపులైన్ల లీకేజీలపై అధికారులు దృష్టి పెట్టారు. గతేడాది ఎండాకాలం ఏఏ గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సారి ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏరోజుకారోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
మిషన్‌భగీరథ ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీలు, జీపీలకు తాగునీరు అందిస్తున్నారు. గతేడాది నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని నీటి వనరులను దేన్నీ వదలకుండా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న కామన్ బోర్లు చాలా వరకు రిపేర్ అయ్యాయి. తాగునీటి బావులు కూడా వినియోగంలో లేవు. దీంతో బోర్ల రిపేర్లతోపాటు బావులను వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
మానేరు, హుస్సేన్‌మియా వాగు పరిసర గ్రామాలకు ఆయా వాగుల్లో బోర్లు వేసి నీటిని సరఫరా చేశారు. కానీ జీపీల్లో కరెంటు బిల్లులు భారం పడడంతో చాలా గ్రామాలు ఆ బోర్లను బంద్ పెట్టారు. ప్రస్తుతం అలాంటివాటిని గుర్తించి తిరిగి నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామ శివార్లలోని వ్యవసాయ బావులను కూడా ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారుల పనిచేస్తున్నారు. గతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం ట్యాంకర్లను ఉపయోగించకుండానే ట్యాపుల ద్వారానే తాగునీటి సప్లైకి చర్యలు
తీసుకుంటున్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూస్తాం
ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో నీటి వనరులపై సర్వే చేస్తున్నాం. రిపోర్ట్ ఆధారంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం. లీకేజీలు, ఇతర సమస్యలు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. - శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ