మూడో పెళ్లి చేసుకుని యువకుడిని మోసగించిన యువతి

జ్యోతినగర్, వెలుగు:  నిత్య పెళ్లి కూతురు చేతిలో పెద్దపల్లి జిల్లా రామగుండం జ్యోతినగర్​కు చెందిన ఓ యువకుడు మోసపోయిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది.   ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి   చెందిన సుద్దాల రేవంత్ గతంలో  ఓ యువతిని పెండ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. కాగా వరంగల్ జిల్లా  నెక్కొండకు చెందిన మెండె అనూష పరిచయమైంది. 2022 డిసెంబర్ లో ఇరు కుటుంబాల సమక్షంలో  చిలుకలయ్య గుడిలో  పెండ్లి జరిగింది.  కొద్ది రోజులకే తన భార్య లిక్కర్​, సిగరెట్లు తాగుతున్నదని రేవంత్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 

కొన్ని రోజుల తర్వాత తన అక్క వసంత ఇంటికి వెళ్తున్నానని చెప్పి 4 తులాల బంగారం , రూ.70 వేలను తీసుకొని వెళ్లింది. తర్వాత ఫోన్ చేస్తే స్విఛ్​ ఆఫ్ రావడంతో  నెక్కొండలో స్నేహితుల వద్ద ఆమె గురించి రేవంత్​ ఆరా తీశాడు.  దీంతో అనూషకు ఇదివరకే ఇద్దరి వ్యక్తులతో పెళ్లైందని తెలుసుకొన్నాడు. తాను మోసపోయానని జూన్ 3న అనూష పై ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు.  విషయం తెలుసుకున్న అనూష తిరుమలగిరికి రమ్మని రేవంత్​కు లోకేషన్ పంపింది. రేవంత్ అక్కడికి వెళ్లడంతో ఆమె స్నేహితులతో కలిసి దాడి చేసింది.  దీంతో ఆమెతో ప్రాణహాని ఉందని సోమవారం మీడియాతో వాపోయాడు.