- ప్లాట్ ఫామ్ పై నుంచి వీడియో తీసిన వ్యక్తి
- పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో దారుణం
పెద్దపల్లి జిల్లా: రామగుండం రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు.. ప్రయాణికులందరూ రైలు కోసం ఎదురు చూస్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్లాట్ ఫామ్ పైకి రైలు వస్తున్న ట్రాక్ పై ఎదురు నిలబడ్డాడు. నడుముపై రెండు చేతులు పెట్టుకుని ఫోజు కొడుతూ నిలబడగా.. ప్లాట్ ఫాంపై అదే రైలు కోసం ఎదురు చూస్తున్న జనం హాహాకారాలు చేస్తూ హెచ్చరించారు. ప్రయాణికుల హెచ్చరికలు.. కేకలను పట్టించుకోకుండా ఆ యువకుడు తనకుఎదురు వస్తున్న రైలునే చూస్తు నిలబడడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు అర్థమైంది. రైలు నడుపుతున్న డ్రైవర్ కంటిన్యూగా సైరన్ మోగిస్తూ.. హెచ్చరించి సడెన్ బ్రేకులు వేసినా ప్రయోజనం లేకపోయింది. రైలు ప్లాట్ ఫాంపైకి వస్తున్న రైలు ట్రాక్ పై ఎదురునిలబడిన వ్యక్తిని ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి ఆగిపోయింది.
ప్లాట్ ఫామ్ పై నుంచి వీడియో తీసిన ప్రయాణికుడు
ప్లాట్ ఫామ్ పై రైలు రాకకోసం ఎదురు చూస్తున్న వ్యక్తి హఠాత్తుగా ట్రాక్ పై దూకి నడుముపై రెండు చేతులు పెట్టుకుని ధైర్యంగా ఆహ్వానిస్తూ నిలబడడం గమనించిన ఓ వ్యక్తి ప్లాట్ ఫామ్ పై నుంచి వీడియో తీశాడు. ఆత్మహత్య నుంచి కాపాడేందుకు ప్రయాణికులంతా కేకలు వేస్తూ హెచ్చరించినా ఆ వ్యక్తి పట్టించుకోకుండా వేగంగా ఎదురొచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానికుడు కాదని.. ఇతర ప్రాంతానికి చెందిన వాడని గుర్తించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్ కుమార్ (27) తన తాతతో కలసి హైదరాబాద్ వచ్చి సిటీలోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే మూడేళ్లుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంటే.. కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వచ్చిన సంజయ్ కుమార్ న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.