
- పెద్దపల్లి జిల్లాలో సర్వేలకే పరిమితమైన సమ్మర్ యాక్షన్ ప్లాన్
- ఫిబ్రవరి మొదటి వారంలో సర్వే పూర్తి
- మార్చి సగం పూర్తయినా కనిపించని కార్యాచరణ
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం
పెద్దపల్లి, వెలుగు: ఫిబ్రవరి 1 నుంచి 12 వరకు తాగునీటి వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. వేసవిలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా జిల్లాలోని తాగునీటి వనరుల గుర్తింపు కోసం ఈ సర్వే చేపట్టారు. సర్వే పూర్తయినా ఇప్పటివరకు తాగునీటి సప్లైకి ఎలాంటి కార్యాచరణ మొదలుపెట్టలేదు. దీంతో తాగునీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మార్చి నెల సగంలోనే ఉండగా తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడంలోనూ అధికారులు ఫెయిల్ అవుతున్నారు.
కానరాని కార్యాచరణ
వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా చేపట్టిన కార్యాచరణలో భాగంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఫిబ్రవరి 1 నుంచి 12 వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాలోని నీటి వనరులు, భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న సరఫరాను పరిశీలించారు. దాదాపు 60 శాతానికి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకొని తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పారు. సర్వే పూర్తయి నెలయినా ఎక్కడి సమస్య అక్కడే ఉంది. జనాలు మాత్రం చేద బావులు, బోరింగులను ఆశ్రయిస్తున్నారు.
భగీరథ లీకేజీలు, రిపేర్లను గుర్తించినట్లు అధికారులు చెప్పినా.. వాటిని కూడా పరిష్కరించలేదు. జిల్లాలోని 266 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో 681 వాటర్ ట్యాంకులు, సుమారు 4,500 బోర్ వెల్స్, 300కు పైగా తాగునీటి బావులు ఉన్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ టైంలో వ్యవసాయ బావులను కూడా వినియోగించేందుకు పరిశీలించారు. కానీ వీటన్నింటిని వినియోగంలోకి ఎలా తీసుకొస్తారో ఇప్పటివరకు ఆచరణలో కన్పించడం లేదు. ఓవైపు ఇప్పటికే టెంపరేచర్ 40 డిగ్రీలు టచ్అవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే చాన్స్ ఉంది.
గ్రామాల్లో తాగునీటి తిప్పలు...
గ్రామ పంచాయతీల్లో సమ్మర్‌లో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. గ్రామాల్లో వేసిన భగీరథ ఇంట్రో రెండు, మూడు రోజులకోసారి లీకేజీలు అవుతున్నాయి. జీపీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రిపేర్ల విషయంలో జాప్యం జరుగుతోంది. దీంతో చాలా గ్రామాల్లో వారానికి మూడు రోజులు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. రిపేర్లు చేయించడానికి జీపీల్లో ఫండ్స్ లేవని సెక్రటరీలు చెబుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో భగీరథ ఇంట్రో ద్వారా ఇంటింటికి కనెక్షన్ ఇచ్చారు. కానీ నీటి సరఫరా మాత్రం జరగడం లేదు. మానేరు పరివాహక మండలాల్లో ఇప్పటికీ నదిలో సంపులు ఏర్పాటు చేసుకొని నీటిని ట్యాంకులకు ఎక్కించి సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం మానేరు కూడా ఎండిపోతుండటంతో సమ్మర్‌లో తాగునీటి పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ భగీరథ నీళ్లు సప్లై సరిగా జరగకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఇప్పటికే టౌన్లలో రెండు రోజులకోసారి సప్లై చేస్తున్నారు. చాలావరకు ఓవర్ హెడ్ ట్యాంకులు పాత పడిపోయాయి. రిపేర్లు అయితే బాగు చేయించేందుకు నెలలు పడుతుంది. లీకేజీల వల్ల వాటర్ సప్లయ్ నిలిచిపోతోంది. భగీరథ నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.