సుల్తానాబాద్, వెలుగు: అర్హులందరికీ రేషన్, హెల్త్ కార్డులు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ ఎంపీడీవో ఆఫీస్‌లో 49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 17 నుంచి నిర్వహించబోయే రెండో విడత ప్రజా పాలనలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇండ్లు కట్టించకుండా కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారన్నారని విమర్శించారు.
ఇండ్ల కోసం పేదల పక్షాన పోరాడిన తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించి, మీ రుణం తీర్చుకుంటానన్నారు. అనంతరం పట్టణంలోని సివిల్ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఉద్యోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. హాస్పిటల్‌లో సౌకర్యాలపై సూపరింటెండెంట్ రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ బిరుదు సమత, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ లీడర్లు మినుపాల ప్రకాశ్‌రావు, అన్నయ్య గౌడ్, అబ్బయ్య గౌడ్, ఎం.రవీందర్, కిశోర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.