- అర్హులను గుర్తించే పనిలో అధికారులు
- పాతకేటాయింపులో అవకతవకలు
- గతంలో జిల్లాకు శాంక్షన్ అయినవి 3394
- పూర్తయినవి 262, కడుతున్న ఇండ్లు 1669
- స్థలం లేక పునాదులు తీయనివి1463
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రెడీ అయ్యారు. గత రెండు రోజుల క్రితం పెద్దపల్లి, చందపల్లిలో నిర్మాణం పూర్తయిన ఇండ్లను ఆయన పరిశీలించారు. గత సర్కార్ టైంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని బాధితులు అప్పుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది.
కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయడం కోసం అసలైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, కరెంటు, డ్రైనేజీ వసతులను వెంటనే కల్పించాలని ఆదేశించారు. అప్పటి సర్కార్ పెద్దపల్లి జిల్లాకు 3394 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది.
తొమ్మిదేండ్ల నుంచి కొనసాగుతున్న పనులు
తొమ్మిదేళ్ల క్రితం డబుల్ ఇండ్ల పనులు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 262 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 1669 ఇండ్లను కడుతుండగా.. 1463 ఇండ్లకు పునాదులు కూడా తీయలేదు. జిల్లాలోని 14 మండలాలకు మంథని మండలంలో 92, కాల్వ శ్రీరాంపూర్‌లో 170 మాత్రమే పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం అర్బన్, మంథని అర్బన్ ప్రాంతాల్లో స్థలం లేక ఇప్పటికీ పనులు చేపట్టలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు.
ప్రభుత్వం కేటాయించిన నిర్మాణాలకు సరిపోతలేదు. నిర్మాణ వ్యయం పెరిగింది, జీఎస్టీ లాంటి ట్యాక్స్‌లతో చాలా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుత లేరు. ఒక్క డబుల్ బెడ్రూం ఇంటికి రూ. 5.30 లక్షలు సర్కార్ కేటాయించింది. ఇంటికి 6 శాతం చొప్పున జీఎస్టీ కట్టాలి. ఒక్కో ఇంటికి రూ. 30 వేలు జీఎస్టీ కింద పోతుంది. ఈ విధంగా 1000 ఇండ్లు కట్టాలంటే కాంట్రాక్టర్ జీఎస్టీ కింది రూ. 3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడానికి ఏ కాంట్రాక్టర్ ధైర్యం చేయడం లేదు.
కట్టినయి పంపిణీ...
కట్టిన ఇండ్లు పంపిణీ చేసేందుఉ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. డబుల్ ఇండ్లకు కావాల్సిన కరెంటు, తాగునీరు, డ్రైనేజీ నిర్మాణాలు వెంటనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు. గత సర్కార్‌లో నాయకులు ఎక్కడ మీటింగ్ పెట్టినా డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు పంచుతున్నట్లు చెప్పుకున్నరు. కానీ పెద్దపల్లి జిల్లాలో పూర్తయిన ఇండ్లు కూడా పేదలకు అందజేయలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో కొన్ని ఇండ్లు పూర్తయ్యాయి. కనీసం వాటినైనా అర్హులైన పేదలకు అందించాలని కొత్త సర్కార్ నిర్ణయించింది.
నియోజకవర్గాల్లో ఇదీ తీరు..
నియోజకవర్గం కేటాయించినవి పూర్తయినవి
పెద్దపల్లి 1454 170
రామగుండం 1260 0
మంథని 650 92