పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని సబ్బితం జీపీ పరిధిలోని గౌరిగుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం జలపాత ప్రదేశాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జలపాతాన్ని ప్రజలు సందర్శించేందుకు రోడ్డు సౌకర్యంతోపాటు వాటర్ ఫాల్స్ వద్ద ఇతర సదుపాయాలు కల్పించేందుకు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సీఎం, పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. జలపాత పరిసర ప్రాంతాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జలపాత పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజకుమార్, కాంగ్రెస్ లీడర్లు, అధికారులు, పాల్గొన్నారు.
సీత్లా భవానీ వేడుకల్లో ఎమ్మెల్యే
సుల్తానాబాద్, వెలుగు: ఓదెల మండలం లంబాడితండా గ్రామంలో మంగళవారం సీత్లా భవానీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి మొక్కులు సమర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు లంబాడితండావాసులు స్వాగతం పలికి సత్కరించారు.