
- కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ, చెన్నూర్ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
పెద్దపల్లి, వెలుగు: కాజీపేట – నాగ్పూర్మధ్య నడిచే అజ్ని ప్యాసింజర్ రైలు పునఃప్రారంభమైంది. దీంతో రైలు పునరుద్ధరణకు కృషిచేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు గురువారం ఓదెల మండలం కొలనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కరోనా టైంలో అజ్నీ ప్యాసింజర్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెయిన్ లేకపోవడంతో పెద్దపల్లి మీదుగా కాజీపేట వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఆ ప్రాంత ప్రయాణికులు సమస్యను ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎంపీ.. విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి వెంటనే అజ్నీ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైలు పునరుద్ధరణకు కృషిచేసిన ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్, అల్లం సతీశ్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, పలకల సాగర్ రెడ్డి, అల్గివెల్లి రవీందర్ రెడ్డి, పలకల కరుణాకర్ రెడ్డి, శ్రీమంతుల సదానందం, తూడి సమ్మయ్య, కృష్ణ, బత్తుల సతీశ్, తూడి రాజయ్య, ఆసరి ఎర్రయ్య, మాటేటి సతీశ్, నాంసానిపల్లి ప్రజలు పాల్గొన్నారు.