రైతు వ్యతిరేక కాంగ్రెస్ ను ఓడించాలే : వెంకటేశ్​ నేత

బెల్లంపల్లి, వెలుగు:  రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ ను ఓడించాలని పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జి బోర్లకుంట వెంకటేశ్​నేత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బెల్లంపల్లి మండలం కన్నాల తిరుమల హిల్స్ లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, కర్నాటక రాష్ట్రాల్లో గడిచిన ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలను కూడా మోసం చేయడానికి అవే తరహా హామీలను ఇచ్చిందని చెప్పారు. 24 గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు అయితే సరిపోతుందని చెప్పిన రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు.

ఇప్పుడు రైతుబంధు ఆపాలని జాతీయ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల  సత్యనారాయణ, వైస్ చైర్మన్  బత్తుల సుదర్శన్, ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. 
 
రైతు బంధు నిలిపేయమనడమేంటి? 

భైంసా, వెలుగు ; రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ పార్టీ ఫిర్యాదు చేయడమేంటని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్మల్​జిల్లా భైంసాలోని బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్​లో ముథోల్​ అభ్యర్థి విఠల్​ రెడ్డితో కలిసి ఆయన ప్రెస్​మీట్​ నిర్వహించారు. రైతు పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్​ రైతుబంధు పథకాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రేవంత్​ రెడ్డి రైతుల ప్రగతిని నిలువరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి భైంసా పాకిస్తాన్​లా ఉందని వ్యాఖ్యాలు చేస్తూ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టిందుకు చూస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​, బీజేపీకి ఓటర్లకు  గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వారి వెంట ఏఎంసీ వైస్​ చైర్మన్​ జేకే పటేల్, లీడర్లు సూర్యం రెడ్డి, మురళీగౌడ్​, కృష్ణ, దత్తురాం పటేల్​ ఉన్నారు.