- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
- దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి
- వంశీకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
- త్వరలోనే ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని హామీ
న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రామగుండం అన్ని విధాలుగా ఆమోదయోగ్యమైనదని కేంద్ర మంత్రికి చెప్పారు. అనంతరం మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. రామగుండం ఒక ఇండస్ట్రియల్ హబ్ అని.. ఇక్కడ ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఇతర ఇండస్ట్రియల్ కంపెనీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని, ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
‘‘తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ లో మాత్రమే ఎయిర్ పోర్టు ఉంది. అది రామగుండానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూరభారం వల్ల శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా లేదు. రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే రామగుండం, పెద్దపల్లితో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో లక్షలాది మంది ఉన్నారు. ఈ అంశాలను కేంద్రమంత్రికి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచాను. నా విజ్ఞప్తిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలో రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు” అని తెలిపారు. ఎయిర్ పోర్టు వచ్చే వరకు తన ప్రయత్నాలు ఆపనని, దీనిపై పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను మరోసారి హామీ ఇస్తున్నానని చెప్పారు.