- కేంద్ర మంత్రి ఖట్టర్‌కు పెద్దపల్లి ఎంపీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కాలుష్య కోరల్లో చిక్కుకున్న మాతంగి కాలనీ వాసుల సమస్యను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ప్లాంట్ నుంచి విడుదలవుతున్న ప్రాణాంతకమైన కణాలను కట్టడి చేయాలన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహార్ లాల్ ఖట్టర్‌తో ఎంపీ వంశీకృష్ణ సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వ్యర్థాలతో స్థానికంగా నివాసిస్తున్న వందల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు.
మాతంగి కాలనీకి చెందిన దాదాపు 300 మంది ఇటీవల తనను కలిసి, ప్లాంట్ వ్యర్థాల సమస్యను వివరించారన్నారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్ధాలు, కాలుష్యంతో ఆ కాలనీ తీవ్ర ఇబ్బంది పడుతున్నదన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే మూలకాలు, కణాలు అందులో ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ కాలుష్య కారకాలను అరికట్టడంలో విఫలమైన ఎన్టీపీసీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.
అలాగే, ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎన్టీపీసీ యాజమాన్యానికి స్థానిక ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రధానంగా థర్మల్ పవర్‌లో ఉపయోగించే బొగ్గుతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఎన్టీపీసీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వంశీకృష్ణ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ సర్కార్ వస్తే కొత్త ప్లాంటు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆశించారని చెప్పారు. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ విషయంలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.