అంబేద్కర్ విగ్రహం తొలగించొద్దు .. కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ

అంబేద్కర్ విగ్రహం తొలగించొద్దు .. కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ పక్కన తీన్ రాస్తాలో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని తొలగించాలనుకోవడం సరికాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ విషయంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు సోమవారం లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి ఆర్థిక సహాయంతో మంత్రి శ్రీధర్ బాబు తోడ్పాటుతో మున్సి పల్ మాజీ చైర్మన్ స్వర్గీయ బడికెల రాజలింగం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. భారతజాతి గర్వించే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడమంటే అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా దళిత సమాజాన్ని అవమానించడమే అవుతుందదన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని లేఖలో పేర్కొన్నారు. రామగుండం రాజీవ్ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి మరో చోట ఏర్పాటు చేసే ప్రతిపాదననూ విరమించుకోవాలన్నారు. 

ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఆఫీసర్లు వ్యవహరించాలని ఎంపీ సూచించారు. కాగా, తమ విజ్ఞప్తికి స్పందించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు బొంకూరి మధు, మైస రాజేశ్, కొంకటి లక్ష్మణ్‌‌‌‌ కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహాల తొలగింపు, రామగుండం లింగాపూర్‌‌‌‌‌‌‌‌లో లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటుపై అధికారులు కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారంపై నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా నాయకులు సంపూర్ణంగా సహకారం అందించాలని వారు కోరారు.