
కోల్ బెల్ట్/గోదావరిఖని, వెలుగు: కాజీపేట టు బల్లార్షా అజ్నీ ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణతో పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కలుగుతాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మంచిర్యాల జిల్లా రవీంద్రఖని(రామకృష్ణాపూర్) రైల్వే స్టేషన్లో అజ్ని ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఉండేదని, మళ్లీ హాల్టింగ్‌ను పునరుద్దరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు రవీంద్రఖని రైల్వే స్టేషన్లో అజ్ని ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు ఆధ్వర్యంలో లీడర్లు ఎంపీకి వినతిపత్రం అందజేశారు.
నేషనల్ హైవే 363 ఫోర్‌లేన్ రహదారిని దాటేందుకు బొక్కలగుట్ట బస్‌స్టేజ్ వద్ద డివైడర్ లేదా అండర్ పాస్ ను ఏర్పాటు చేయాలని ఎంపీకి బొక్కలగుట్ట గ్రామస్తులు, యువకులు వినతిపత్రం అందజేయగా.. హైవే ఆఫీసర్లతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. మందమర్రి బస్టాండ్‌లోకి బస్సుల రాకపోకలు, హైదరాబాద్‌కు సర్వీసుల పెంచాలని మంచిర్యాల డిపో మేనేజర్జనార్దన్ తో ఫోన్లో ఎంపీ మాట్లాడారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ..
మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ వంశీకృష్ణ పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనారోగ్యం బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోపతి రాజయ్యను ఎంపీ పరామర్శించి ఆరోగ్యం పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు.