మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గంలోని సోమన్పల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. చెన్నూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో గురుకుల పాఠశాలలో సౌకర్యాలు లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 28 గురుకుల పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం అని ఆయన చెప్పారు. మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలని, వారు చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ చెప్పినట్లు ‘రైట్ టు ఎడ్యుకేషన్’ను ఆదర్శంగా తీసుకుని కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని తెలిపారు.
5000 మంది నిరుపేద విద్యార్థులు సబ్సిడీపై చదువుకుంటున్నారని, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో అంబేద్కర్ విద్యా సంస్థలు నిలబెట్టాయని చెప్పారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుందని, అందరు చదువుకోవాలని, పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలవాలని విద్యార్థులకు పెద్దపల్లి ఎంపీ సూచించారు. తల్లితండ్రులు తమ పిల్లలను మంచి చదువులు చదివించి ప్రోత్సహించాలని కోరారు. జోడు వాగు రోడ్డు పర్మిషన్ కోసం కేంద్ర మంత్రి కలిశామని చెప్పారు. ఇప్పటికే రామగుండం రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్స్ హాల్టింగ్ కోసం కేంద్ర రైల్వే శాఖ అధికారులను కలవడం జరిగిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.