- 126 కుటుంబాలకు రూ.18 కోట్ల విలువైన
- చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
- గత బీఆర్‌ఎస్ సర్కార్ ఎల్లంపల్లి నిర్వాసితులను పట్టించుకోలేదని ఫైర్
- ప్రాజెక్టు కోసం భూములివ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడిన ఎంపీ
జగిత్యాల/ మంచిర్యాల, వెలుగు:రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోలేదని, వారికి పరిహారం కూడా ఇవ్వలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో 126 ఎల్లంపల్లి నిర్వాసిత కుటుంబాలకు రూ.18 కోట్ల విలువైన చెక్కులను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో వంద శాతం ముంపునకు గురైన చెగ్యాం గ్రామ నిర్వాసితులను గత బీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
కాకా వెంకటస్వామి హయాంలో రూపకల్పన చేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు చెక్కుల పంపిణీలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాకా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఎల్లంపల్లి భూ నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెగ్యాం గ్రామస్తుల కష్టాలను దగ్గుర్నుంచి చూశానని, ప్రాజెక్టు కోసం భూములు త్యాగాలు చేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.
విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాకా కృషితోనే చెగ్యాంను వంద శాతం ముంపు గ్రామంగా ప్రకటించారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. పరిహారం కోసం గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు. మిగతా గ్రామాలకు పెండింగ్ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వెల్గటూర్ మండలం మొక్కట్రావుపేట్, ముత్తునూరు, చెగ్యాం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం చెప్పారన్నారు. ఈ సీజన్‌లో సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం తరుగు పేరిట దోపిడీ చేసిందని ఆరోపించారు.
గత పరిహారం వివరాలు..
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన కొంత మంది బాధితులకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2007లోనే పరిహారం అందజేసింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటి లింగాల, మొక్కట్రావ్ పేట్, రాంనూర్, చెగ్యాం, తాళ్ల కొత్తపేట్‌లో నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది. చెగ్యాం, కోటి లింగాల గ్రామంలో 4.36 ఎకరాలు, 109 నిర్మాణాలకు రూ.5.35 కోట్లు, తాళ్లకొత్తపేట్‌లో 20.15 ఎకరాలు, 207 నిర్మాణాలకు రూ.4.25 కోట్లు, రాంనూర్‌లో 16.31 ఎకరాలు, 74 నిర్మాణాలకు రూ.7.72 కోట్లు, ముక్కరావు పేట్‌లో కేవలం 97 నిర్మాణాలకు రూ. 1.96 కోట్లు అందజేశారు.
విద్య, వైద్యంపై మరింత ఫోకస్ పెట్టండి..
మంచిర్యాల జిల్లాలో విద్య, వైద్య రంగాలపై మరింత ఫోకస్ పెట్టాలని అధికారులను దిశ కమిటీ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశించారు. ఆయన అధ్యక్షతన గురువారం మంచిర్యాల కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్, కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ (దిశ) కమిటీ మీటింగ్ నిర్వహించారు. బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ కుమార్ దీపక్, డీఆర్డీవో కిషన్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుధీర్ఘంగా రివ్యూ చేశారు.
ఆయా పథకాలు, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయా? నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా? ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత పాటిస్తున్నారా? కచ్చితమైన సమాచారం ఇవ్వాలని అధికారులను ఎంపీ ప్రశ్నించారు. అయితే, ఎంపీ వంశీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు తడుముకున్నారు. అభివృద్ధి పనులపై అధికారులకు పూర్తి క్లారిటీ ఉండాలని, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు మంచినీరు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్లు వంటి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు.