- ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్
- కాకా ఇంట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సన్మానం
సికింద్రాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఎంపీగా గెలిచాక మొదటిసారి మారేడుపల్లిలోని తన తాత, దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరాజ్ ఆధ్వర్యంలో వంశీకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరరాజు మాట్లాడుతూ.. కాకా మనవడు పెద్దపల్లి ఎంపీగా గెలవడం ఆనందంగా ఉందన్నారు.
ఫూలే, అంబేద్కర్, కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు న్యాయం చేయాలని కోరారు. వంశీకృష్ణ పార్లమెంటులో బడుగు, బలహీన వర్గాల హక్కులపై గళం విప్పుతారనే నమ్మకం ఉందన్నారు. నాయకులు ముడిమడుగుల శంకర్, పోలేపాగ సురేశ్‌కుమార్, కప్ప కృష్ణ గౌడ్, పీవీ రమణ, వెంకట్ రాజ్, గోడుకే మాధవరావు, రాజేశ్వరి, లావణ్య, ధ్యాన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.