తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి ఖిల్లా..రోప్వే, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి ఖిల్లా..రోప్వే, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాకు రోప్‌‌ వే ఏర్పాటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రకృతి అందాలకు, అద్భుత శిల్పకళకు నెలవైన రామగిరి ఖిల్లాకు రోప్‌‌ వే ఏర్పాటయితే ఈ ప్రాంతం గొప్ప పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశముంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈనెల 11న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీని కలిశారు. పర్వతమాల ప్రాజెక్ట్ కింద రామగిరి ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రామగిరి ఖిల్లాను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుకు సిద్ధమైంది. 

టూరిజం స్పాట్‌‌గా అభివృద్ధికి అవకాశం 

రామగిరి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు చొరవతో ఖిల్లా చుట్టూ రోడ్ల నిర్మాణానికి ఇటీవల రూ.5కోట్లు కేటాయించారు. దీంతోపాటు రామగిరి సమీపంలో స్టేట్‌‌, నేషనల్​ హైవేలు నిర్మాణాలు జరుగుతున్నాయి. రామగిరి, ముత్తారం మీదుగా వరంగల్‌‌కు ఎన్‌‌హెచ్‌‌ 63ని నిర్మిస్తున్నారు. పెద్దపల్లి నుంచి కునారం వ్యవసాయ కేంద్రం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లి వైపు మరో స్టేట్​హైవే నిర్మాణం జరగనుంది. పీఎం సడక్​ యోజన కింద అమ్రాబాద్​ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వవరకు రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఈ రోడ్డులో ముత్తారం మండలంలో రెండు బ్రిడ్జిలు ఒక్కోటి రూ.2.50 కోట్లతో నిర్మించనున్నారు. 

వీటన్నింటిపై ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ రోడ్లన్నీ రామగిరి ఖిల్లాకు సమీపం నుంచే పోతున్నాయి. ఈ క్రమంలో రోడ్లతో పాటు పర్వతమాల ప్రాజెక్టు కింద ఖిల్లా పైకి రోప్​ వే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరినీ కలిసి వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.  ఇప్పటికే రామగిరి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రామగిరి ఖిల్లా చరిత్ర, శిల్పకళ, ప్రకృతి సోయగాలు.. తదితర అంశాలపై నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

టూరిస్ట్​ స్పాట్‌‌గా రామగిరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే రామగిరితోపాటు మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్​ మండలాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల జిల్లా మొత్తం రవాణా, టూరిజం బిజినెస్‌‌లు అభివృద్ధి చెందే చాన్స్​ ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బేగంపేట, రత్నాపూర్​, కల్వచర్ల  గ్రామాల మధ్య ఖిల్లా విస్తరించి ఉంది. ప్రతీ ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆయుర్వేద డాక్టర్లు, బొటనీ సైంటిస్టులు బొటానికల్​ టూర్​ కోసం ఇక్కడకు వస్తుంటారు. 

ఖిల్లాను చేరుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి రోడ్డు మార్గాలు లేవు. ఖిల్లాను చేరుకోవడానికి సుమారు 10 కిలోమీటర్లు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని, దీనికి ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.