
- 20 ఏండ్ల తర్వాత అందించిన సింగరేణి యాజమాన్యం
కోల్ బెల్ట్,వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో సింగరేణి కార్మికుడి కుటుంబానికి 20 ఏండ్ల తర్వాత రూ.35లక్షల నష్టపరిహారం అందింది. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సుధానగర్కు చెందిన సింగరేణి కార్మికుడు రెడపాక నారాయణ శ్రీరాంపూర్ఏరియా ఆర్కేన్యూటెక్ బొగ్గు గనిలో కోల్ఫిల్లర్గా చేస్తూ 2005 అక్టోబర్12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పట్లో అతని పిల్లలు చిన్నవాళ్లు కావడంతో జాబ్ లో చేరేందుకు అర్హత లేకుండా పోయింది.
భర్తకు రావాల్సిన ఎంఎంసీ పరిహారం(మెటర్నిటి మెడికల్ కాంపెన్సేషన్ ) కోసం భార్య కమలమ్మ దరఖాస్తు చేసుకుని 20 ఏండ్లుగా సింగరేణి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను బాధితురాలు కమలమ్మ కలిసి తన గోడు చెప్పుకుంది. స్పందించిన ఎంపీ వెంటనే సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్తో మాట్లాడి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో వెంటనే సింగరేణి బాధిత కుటుంబానికి రూ.35లక్షల చెక్కును అందజేసింది. తమ సమస్యను పరిష్కరించిన ఎంపీ వంశీకృష్ణకు రుణపడి ఉంటామని కమలమ్మ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.