- ఆరు దాటితే ఆటోలూ బంద్
- గ్రామాలకు వెళ్లలేక బస్టాండ్‌లో నిద్రిస్తున్న ప్రయాణికులు
- పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
పెద్దపల్లి, వెలుగు: జిల్లా కేంద్రం నుంచి రాత్రి 7 దాటితే గ్రామాలకు వెళ్లడానికి బస్సులు నడవకపోవడంతో పెద్దపల్లి నుంచి 30 కిలో మీటర్ల పరిధి గ్రామాల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాయంత్రం దాటిన తర్వాత పెద్దపల్లిలో రైలు దిగినా, బస్సు దిగినా ఇండ్లకు చేరుకోవాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. కొన్నిసార్లు అవికూడా ఉండవు. దీంతో మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పెద్దపల్లి బస్టాండులోనే ఉండాల్సి వస్తోంది.
రాత్రి దిగితే బస్టాండే దిక్కు..
పెద్దపల్లి జిల్లాకు బస్ డిపో లేకపోవడంతో గోదావరిఖని, మంథని, కరీంనగర్, మంచిర్యాల డిపోల బస్సులు ఇక్కడకు వచ్చి వెళ్తుంటాయి. వచ్చే బస్సుల్లో చాలా వరకు పెద్దపల్లి బస్టాండ్‌లో ఆగడం లేదు. కనీసం మండల కేంద్రాలకు కూడా బస్సులు కంటిన్యూగా వెళ్లడం లేదు. పెద్దపల్లిలో రైల్వే జంక్షన్ ఉండటంతో 24 గంటలు రైళ్లు నడుస్తాయి. దీంతో ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రాత్రి వేళ రైలు దిగితే తెల్లారే దాకా బస్టాండులోనే ఉండాల్సి వస్తుంది. మంథని, ధర్మారం, సుల్తానాబాద్ మండలంలోని చాలా గ్రామాలు, జూలపల్లి, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్ రూట్లలో తెల్లారితేనే బస్సులు, ఆటోలు నడుస్తాయి.
మంథనికి పోయిన బస్ డిపో..
గతంలో పెద్దపల్లికి శాంక్షన్అయిన బస్ డిపోను మంథనికి తరలించారు. అప్పట్లో మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి శ్రీధర్‌బాబు డిపోను మంథనికి మార్చుకున్నారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన ఆర్టీసీ యాజమాన్యం డిపోను మంథనికి మార్చారని ఆరోపణలున్నాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు పెద్దపల్లికి కనెక్ట్ అయి ఉండటంతో ఇక్కడ డిపో ఏర్పాటైతే జిల్లాలోని 60 శాతం గ్రామాలు లబ్ధి పొందుతాయి.
రోజుకు ఒక్క బస్సే వస్తది
పెద్దపల్లికి అతి సమీపంలో ఉన్న మా గ్రామానికి ఒక్క బస్సు మాత్రమే వస్తది. గ్రామాల నుంచి రోజు పెద్దపల్లికి వివిధ పనుల మీద ప్రజలు వెళ్తారు. ఆటోలు కూడా సాయంత్రం 6 దాటితే బంద్ అవుతాయి. దీంతో పనులు పూర్తికాక లేట్ అయితే పెద్దపల్లిలోనే ఉండాల్సి వస్తోంది.
- బాలసాని సతీశ్, భోజన్నపేట, పెద్దపల్లి
బస్సు డిపో ఏర్పాటు చేయాలె
పెద్దపల్లిలో బస్సు డిపో పెట్టాలె. డిపో లేకపోవడంతో రాత్రి టైంలో రైలు దిగితే బస్టాండులోనే నిద్ర చేసుడైతాంది. డిపో ఉంటే 24 గంటలు బస్సులు నడుపవచ్చు. ఈ విషయంపై ఎన్నోసార్లు పెద్దపల్లి ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకుంటలేరు.
- సూర్యనారాయణ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి