పెద్దపల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు చెలరేగుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, రైతులను వారు నిద్రపోనివ్వడం లేదు. కొన్ని రోజులుగా వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లను టార్గెట్ చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగను ఎత్తుకెళ్తున్నారు. పగటి వేళ రెక్కీ చేసి.. రాత్రివేళ ఎటాక్ చేస్తున్నారు. దీనివల్ల కొత్త ట్రాన్స్ ఫార్మర్లను అమర్చేందుకు విద్యుత్ శాఖపై ఆర్థిక భారం పడుతోంది. రైతులకూ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నీరు అందక పంటలకు నష్టం జరుగుతోంది. 11 కేవీ పవర్ కేబుల్ ను తాకితే స్పాట్ లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రాణానికే అపాయమని తెలిసినా కాపర్ వైర్ కోసం దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకు ఇద్దరు, ముగ్గురు వచ్చి కాపర్ చోరీ చేస్తున్నారు.
దాదాపు నలభై రకాల పరికరాలతో గంటలోనే ట్రాన్స్ ఫార్మర్లను పగులకొడుతున్నట్లు తెలుస్తోంది. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ ను వారం రోజుల్లోనే పగులగొట్టి రాగి తీగను దొంగలు ఎత్తుకెళ్లారు . ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాల కేసులను పెద్దపల్లి డీసీపీ రూపేశ్, ఏసీపీ సారంగపాణిలు సీరియస్ గా తీసుకున్నారు. నాలుగు స్పెషల్ టీమ్ లతో వెతికి ట్రాన్స్ ఫార్మర్ల దొంగలను పట్టుకున్నారు.
11 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి రెండు క్వింటాళ్ల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో 25 ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టినట్లు గుర్తించారు. కాపర్ వైర్ ను కొంటున్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 మంది స్క్రాప్ దుకాణదారులను బైండోవర్ చేశారు. గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆరుగురు సభ్యులున్న మరో ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా 32 ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టినట్లు విచారణలో తేలింది.