- ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ
- సీఎం రేవంత్ సారథ్యంలో ప్రజలకు న్యాయం చేస్తున్నం: వివేక్ వెంకటస్వామి
- మంచిర్యాల, పెద్దపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశాలు
పెద్దపల్లి/ సుల్తానాబాద్, వెలుగు: తనను ఎంపీగా గెలిపిస్తే కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి దాని ద్వారా పెద్దపల్లి జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట, లక్షెట్టిపేట, హాజీపూర్, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లిలో.. మంచిర్యాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామికి పెద్దపల్లితో 70 ఏండ్ల అనుబంధం ఉందని, తెలంగాణ తొలి ఉద్యమంలో తుపాకి గుళ్లకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన యోధుడు కాకా అని చెప్పారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని అన్నారు. మీ కుటుంబంలో చిన్న కొడుకుగా భావించి తనను ఆదరించి ఎంపీగా గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారని.. కానీ బీఆర్ఎస్ అవినీతి పాలనలోప్రజల ఆశలన్నీ అడియాశలయ్యాయని వంశీకృష్ణ విమర్శించారు. బీఆర్ఎస్ లీడర్లు ఇసుక, భూదందాలతో దోపిడీకి తెగబడ్డారని.. ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చెప్పారు. వారి హయాంలో డిగ్రీలు, పీజీలు చేసిన యువత ఆటోలు నడుపుకునే దుస్థితికి వచ్చిందన్నారు. తాను పదేండ్లుగా పారిశ్రామిక రంగంలో ఉన్నానని.. వందల మందికి ఉద్యోగాలు కల్పించానని తెలిపారు.
ఎంపీగా గెలిస్తే పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ప్రభుత్వ రంగం సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాని చెప్పారు. ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్దపల్లి ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని, కేసీఆర్తన జేబులు నింపుకోవడానికే ఆ ప్రాజెక్టుకును వాడుకున్నారని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ నీటిని విడుదల చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు కృషిచేశారని పేర్కొన్నారు. గూడెం సత్యనారాయణ ఆలయ సాక్షిగా దండేపల్లి అభివృద్ధి కోసం ప్రేమ్‌సాగర్‌రావు సలహాలు తీసుకుని పనిచేస్తానని చెప్పారు.
యువతకు ఉపాధి కల్పించడమే వంశీ విజన్: వివేక్ వెంకటస్వామి
వంశీకృష్ణను గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా స్ఫూర్తిగా వంశీ ప్రజలకు ఎళవేళలా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాడని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, విజయరమణారావు సహకారంతో వంశీ కృష్ణ ఈ ప్రాంతం అభివృద్ది, ప్రజ సంక్షేమానికి కృషి చేస్తాడని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే విజన్‌తో వంశీకృష్ణ ఉన్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ పెద్దపల్లి పార్లమెంటు ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు న్యాయం చేయడానికి పనిచేస్తున్నామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. మహిళలను లక్షాధికారిని చేయడం కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వంశీ గెలుపుతో ఈ ప్రాంతం డెవలప్ అయితది: ప్రేమ్‌సాగర్‌రావు
ఎంపీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి వంశీకృష్ణకు లక్ష మెజార్టీ ఇస్తామని ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. యువకుడైన వంశీ గెలుపుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వంశీకృష్ణ గెలుపు కోసం తన సొంత మండలం దండేపల్లి నుంచి ప్రచారం మొదలుపెట్టానని, ఇక్కడి ప్రజలు భారీ మెజార్టీ ఇస్తారని వంశీకి, వివేక్ వెంకటస్వామికి మాట ఇస్తున్నానని చెప్పారు. వంశీ గెలుపుతో గూడెం దేవస్థానాన్ని అన్నవరం దేవస్థానంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.
బీఆర్ఎస్ది నీచమైన చరిత్ర: విజయ రమణారావు
ఫోన్లు ట్యాపింగ్ చేసి భార్యాభర్తల మధ్య మాటలు విన్న నీచమైన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో నిందితురాలు కావడంతో ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా పాలన చేసిందని ఆరోపించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.