నష్టపరిహారం ఇవ్వాలని ట్యాంక్​ ఎక్కి నిరసన

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్‌‌‌‌ గ్రామంలో  తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఆర్‌‌‌‌అండ్ఆర్‌‌‌‌  ప్యాకేజీ వర్తింపజేయాలని  డిమాండ్‌‌‌‌  చేస్తూ  సోమవారం నలుగురు సింగరేణి  నిర్వాసితులు వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ ఎక్కి  నిరసన తెలిపారు. 2009  సంవత్సరంలో  సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 11ఏ మైన్‌‌‌‌ విస్తరణ కోసం చందనాపూర్‌‌‌‌ ఎస్సీ కాలనీలోని ఇండ్లు తీసుకుని భూసేకరణ చేపట్టింది. 2018లో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ అమలు చేసినా ఇంకా 15 మందికి ఇవ్వలేదు. దీనికితోడు ఆర్జీ 3 ఏరియాలో రచ్చపల్లి, అడ్రియాల గ్రామాల్లో ఇచ్చిన విధంగా తమకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని 76 మంది డిమాండ్‌‌‌‌ చేస్తూ వచ్చారు.  2022 వరకు 18 ఏండ్లు నిండిన వారికి కూడా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో చందనాపూర్‌‌‌‌ ఎస్సీ కాలనీకి కరెంట్‌‌‌‌ కట్‌‌‌‌ చేయడంతో నిర్వాసితులైన రామగిరి సారయ్య, శంకర్‌‌‌‌, సంతోష్​, జనగామ రాజేందర్‌‌‌‌ కలిసి ఆదివారం రాత్రి 8 గంటలకు గ్రామంలోని వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ ఎక్కారు. 

తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ట్యాంకు దిగేది లేదని స్పష్టం చేశారు. కాగా సోమవారం ఉదయం సింగరేణి ఆఫీసర్లు, పోలీసులు గ్రామానికి చేరుకుని నిర్వాసితులకు నచ్చ జెప్పారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  వీరిలో ఇద్దరు ట్యాంక్‌‌‌‌ దిగగా, మధ్యాహ్నం ఒంటి గంటకు మిగిలిన ఇద్దరు కూడా ట్యాంక్‌‌‌‌ దిగి వచ్చారు. సాయంత్రం ఆర్జీ 1 ఏరియా జీఎం ఆఫీస్‌‌‌‌లో నిర్వాసితులు జీఎం చింతల శ్రీనివాస్‌‌‌‌కు వినతిపత్రం అందజేయగా, ఆ తర్వాత వారితో ఆయన చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  చర్చల్లో  డీటీ రాకేశ్‌‌‌‌,  సర్పంచ్‌‌‌‌ దాసరి శంకర్‌‌‌‌, గోదావరిఖని టూటౌన్‌‌‌‌ సీఐ వేణుగోపాల్‌‌‌‌ పాల్గొన్నారు.