నా నేస్తం సేవలు స్ఫూర్తిదాయకం : విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: తాము చదువుకున్న మండలానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.  ఎలిగేడు మండల కేంద్రంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని, ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పూర్వ విద్యార్థులైన స్నేహితులంతా కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. 

మండలంలోని లాలపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం మహిళల కోసం గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. నర్సాపూర్, నారాయణ పల్లి, ముప్పిరి తోట, లాలపల్లి, బురహాన్ మియాపేట తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నా నేస్తం గౌరవాధ్యక్షుడు రాజేశ్వరరావు, కట్ల సత్యనారాయణ , బూర్ల వెంకటేశ్వర్లు , వెంగళదాసు అశోక్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రేణుక, కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.