పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఆయన తల్లి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భార్య గడ్డం సరోజ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రామాలయాల్లో నిర్వహించిన నవమి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని రామాలయంలో గడ్డం సరోజకు ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పలికింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే, రామగిరి మండలం సెంటినరీ కాలనీలో షిరిడీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన రాములవారి కల్యాణ మహోత్సవంలో వంశీకృష్ణతో పాటు సరోజ పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ రామచంద్ర రావు, వర్కింగ్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణారెడ్డి, గాండ్ల మోహన్, మాదాసు విజయ్ కుమార్, తొగరి తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, సాంబిరెడ్డి, ఉనుకొండ శ్రీధర్, ఉనుకొండ భూమయ్య, పూదరి మహెందర్ తదితరులు పాల్గొన్నారు.