- ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- పాల్గొన్న ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్, వినోద్
గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసి 100 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం అభినందనీయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సంస్థకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ నిర్మించి 50 ఏండ్లు, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం రాత్రి ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంత కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలోనే సోలార్ రూఫ్‌ను అభివృద్ధి చేసి.. దాని హక్కులు దక్కించుకుందని గుర్తు చేశారు.
మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు 50 ఏండ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమానికి హాజరుకావడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఎంపీగా తనకు అవకాశం కల్పించిన 20 లక్షల మంది పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. దేశానికి వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో త్యాగం చేశారని, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రం సంస్థ ఎలాంటి సహకారం అందించడం లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ దేశ వ్యాప్తంగా ఉన్న యూనిట్లలో 76,462 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డ్ నెలకొల్పిందని, సంస్థ మరింత ప్రగతి సాధించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆకాంక్షించారు.
ఎన్టీపీసీ, సింగరేణి కుటుంబాలకు చెందిన వారితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఎన్టీపీసీ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. అంతకుముందు ఎన్టీపీసీ ముద్రించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఆర్ఈడీ కేదార్ రంజన్ పాండు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు, నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్‌ప్రసాద్, ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా, ఏజీఎం హెచ్ఆర్ విజయ్ కుమార్ సిక్దర్, ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బాలీవుడ్ సింగర్లు వైభవ్ గుప్తా, మహాలక్ష్మి అయ్యర్ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో అలరించాయి.