- రైల్వే మంత్రిని కోరినందుకే రామగుండంలో హాల్టింగ్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- సింగరేణి నుంచి రైల్వేకు రూ.10వేల కోట్ల ఆదాయం
- పార్లమెంట్లో పెద్దపల్లి ప్రజల గొంతుకనవుతానని వెల్లడి
- రామగుండం స్టేషన్లో జెండా ఊపి ట్రైన్ ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌తో నాగ్‌పూర్, సికింద్రాబాద్ మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి రామగుండంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిలుపుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అందులో భాగంగానే వందేభారత్ ట్రైన్‌కు రామగుండంలో హాల్టింగ్‌కు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ ట్రైన్‌తో కనెక్టివిటీతో పాటు బిజినెస్ కూడా పెరుగుతుందన్నారు. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ ట్రైన్ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్‌తో కలిసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పచ్చ జెండా ఊపారు. అంతకుముందు జరిగిన మీటింగ్‌లో వంశీ కృష్ణ మాట్లాడారు. ‘‘నాగ్‌పూర్ నుంచి బయలుదేరే ట్రైన్.. సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హార్షా తర్వాత రామగుండం స్టేషన్లోనే ఆగుతది. దీంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ఏటా రైల్వేకు రూ.2.60 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది. అందులో సింగరేణి కోల్‌బెల్ట్ నుంచి రూ.10వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరుతున్నది’’అని వంశీ కృష్ణ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కేంద్ర మాజీ మంత్రి, దివంగత మహానేత కాకా వెంకటస్వామి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆయన చూపిన బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. కాకా సేవలను గుర్తించి.. తనను కూడా ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు. ‘‘ఇటీవల పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చాను. పెద్దపల్లి ప్రాంత సమస్యలపై పార్లమెంట్లో ప్రజల గొంతుక అవుతాను.
వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తాను’’అని వంశీ కృష్ణ అన్నారు. రైల్వే శాఖ నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు ఎంపీ వంశీ కృష్ణ మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఏడీఆర్ ఎం.రాజీవ్ గంగూలీ, రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్, మేయర్ అనిల్ కుమార్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కన్నూరి సతీశ్ కుమార్, అనుమాస శ్రీనివాస్, క్యాతం వెంకటరమణ, కోమళ్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.