కొమురవెల్లి, వెలుగు : కృష్ణాష్టమి సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం పెద్దపట్నం వేశారు. ముందుగా ఒగ్గు పూజారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణుడు, సత్యభామ వేషధారణతో ఆలయ ప్రాంగణంలో ఉట్లు కొట్టి, స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద పసుపు, కుంకుమ, తెల్ల, పచ్చ పిండి, సునేరుతో 21 వరుసలతో పెద్దపట్నం వేశారు.
యాదవ ఒగ్గు పూజారులు పెద్దపట్నం చుట్టూ గుమ్మడికాయలు, నిమ్మకాయలతో బలిహరణ, బోనం సమర్పణ తర్వాత ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నాన్ని దాటారు. తర్వాత శివసత్తులు, పోతురాజులు, భక్తులు పెద్దపట్నం దాటుతూ స్వామివారిని దర్శించుకున్నారు. మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో ఈవో బాలాజీశర్మ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు సురేందర్, శ్రీరాములు, ఎలక్ట్రికల్ ఏఈ భాస్కరరావు పాల్గొన్నారు.