- కొమురవెల్లిలో ఘనంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు-
- పసుపు బండారి మయమైన ఆలయ ప్రాంగణం
- మల్లన్న నామస్మరణతో మార్మోగిన క్షేత్రం
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లన్న క్షేత్రం -పసుపు బండారి మయమైంది. జాతర బ్రహ్మోత్సవాల్లో పట్నంవారం (మొదటి ఆదివారం)ను పురస్కరించుకొని సోమవారం ఆలయ తోటబావి వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు మానుక పోచయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు, శివసత్తులు, భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా కొనసాగింది. హైదరాబాద్ యాదవ సంఘం ఒగ్గు పూజారులు పంచవర్ణాలతో (పసుపు, కుంకుమ, తెల్లపిండి, ఆకుపచ్చ, సునేరు) 21 వరుసలతో పెద్దపట్నం వేశారు. అదే సమయంలో అగ్నిగుండాల కోసం ఐదు క్వింటాళ్ల సమిధలు పేర్చి వాటిని కాల్చి భగభగ మండేనిప్పు రవ్వలుగా తయారు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌తో పాటు అర్చకులు ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగింపుగా పెద్దపట్నం వద్దకు చేర్చి యాదవుల సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు (కల్యాణం) నిర్వహించారు.
అనంతరం ఒకరిపై ఒకరు పసుపు బండారి చల్లుకోవడంతో తోటబావి ప్రాంగణంతో పాటు స్వామివారి సన్నిధి పనుపువర్ణ శోభితమైంది. ఆ తర్వాత ఆలయ అర్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు ఉత్సవ విగ్రహాలు పట్టుకొని పెద్దపట్నం, అగ్నిగుండాలు దాటారు. అనంతరం గ్యాలరీలలోని భక్తులు, శివసత్తులు, యాదవ భక్తులు మల్లన్న నామస్మరణతో పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నాన్ని, అగ్నిగుండాలు దాటుతూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు. సుమారు 30 వేల మందికి పైగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆనవాయితీ ప్రకారంగా ఆలయ ఈఓ రామాంజేయులు, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులకు, శివసత్తులకు కొత్త బట్టలు పెట్టి ఘనంగా సన్మానించారు.
స్పృహ తప్పిన వృద్ధురాలు..
పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటే సమయంలో ఓ వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది. హైదరాబాద్ కు చెందిన ఆ వృద్ధురాలు కార్యక్రమాన్ని వీక్షించి భక్తులతో కలసి నడుస్తుండగా హఠాత్తుగా పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రజనీకాంత్ వెంటనే ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి పక్కనే ఉన్న మెడికల్ క్యాంపునకు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్తీసుకున్న కొద్ది సేపటి తరువాత ఆమె కోలుకుంది. ఎండలో చాలా సేపు ఉండడంతో నీరసించి వృద్ధురాలు కింద పడిపోయిందని మెడికల్ సిబ్బంది వెల్లడించారు.