పెద్దాపూర్ మల్లన్నకు 60 వేల బోనాలు: స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు

పెద్దాపూర్ మల్లన్నకు  60 వేల బోనాలు: స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు
  • మల్లన్నకు పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం సమర్పణ

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు:జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మల్లన్న బోనాల జాతర వైభవంగా జరిగింది. తెలంగాణలో రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతరగా ఈ ఉత్సవానికి పేరు ఉంది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరకు లక్షల్లో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం ఒకేసారి దాదాపు 60 వేల మందికిపైగా మహిళలు బోనాలు తీసుకొచ్చి, స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కోరిన కోర్కెలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టు పక్కల జిల్లాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామికి నైవేద్యంగా బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం, వందల సంఖ్యలో గొర్రె పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. 

గూడాన్నం, పరమాన్నం బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. బోనాల శోభాయాత్ర అనంతరం ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. స్వామివారికి ఆదివారం ఇష్టమైన రోజు కావడంతో ప్రతివారం ఆ రోజున గ్రామస్తులు మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నిష్టతో ఉంటారు. గ్రామస్తులు కొన్నేండ్లుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.