నర్సంపేట, వెలుగు : నర్సంపేటలో తాను గెలవకుండా దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఒక్కటయ్యారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కూడా ఓడిపోయానని, తర్వాత గెలిచి ఐదేళ్ల పాటు నర్సంపేటలో అవినీతి రహిత పాలన అందించానని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు తాను తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. తాను నర్సంపేటలోనే ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేశానన్నారు. ప్రజలు తనను మరిచినా.. తాను మరువలేనన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి నర్సంపేటకు తీసుకొచ్చిన పనులను పూర్తి చేయాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్ లీడర్లు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, గుంటి కిషన్, పొన్నం మొగిలి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, దార్ల రమాదేవి పాల్గొన్నారు.