- పరిశీలనలో బాబుమోహన్, తాటికొండ రాజయ్య పేర్లు
- టికెట్ ప్రయత్నాల్లో ఉద్యమకారులు
వరంగల్ బీఆర్‍ఎస్ ఎంపీ టికెట్‌ను కడియం కావ్య తిరస్కరించడంతో ఆమె స్థానంలో జడ్పీటీసీ పెద్ది స్వప్న పేరు వినిపిస్తోంది. ఆమెతో పాటు బీఆర్‍ఎస్‍కు రాజీనామా చేసి ఇంకా ఏ పార్టీలో చేరని తాటికొండ రాజయ్య, సినీనటుడు బాబుమోహన్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు పలువురు ఉద్యమకారులు, కేయూ జేఏసీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి భార్య పెద్దిస్వప్న ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందినవారు. నల్లబెల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచిన ఆమె పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్నారు. స్వప్న తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా ఉండడంతో ఉద్యమకారులు, కేయూ జేఏసీ నేతలు కూడా సపో ర్ట్ చేస్తారని భావిస్తున్నారు. ఆమె గతంలోనూ వరంగల్ ఎంపీ టికెట్ఆశించారు. ఇప్పుడు కావ్య తప్పుకోవడంతో ఆ స్థానంలో మహిళగా స్వప్నకు అవకాశమివ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
మరోవైపు కడియం కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం, తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించి, టికెట్ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తరఫున శుక్రవార రాజయ్యతో చర్చలు జరిపినట్టు సమాచారం. కేడర్‌తో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయాన్ని చెబుతానని రాజయ్య సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రాజయ్యకు స్టేషన్ ఘన్‍పూర్‍తో పాటు మాదిగ సామాజికవర్గంలో పట్టు ఉంది.
కడియం వల్లే పార్టీకి దూరమైన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ బరిలో ఉంటానని చెప్పిన సినీనటుడు బాబుమోహన్ కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు కూడా టికెట్వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.