మంథని, వెలుగు: మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ పనులను స్పీడప్ చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం మంథని మున్సిపల్ ఆఫీసులో అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణపై ఆర్డీవో వి.హనుమా నాయక్, రెవెన్యూ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకకోలా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుంజపడుగు, సిరిపురం, అడవి సోమన్ పల్లిలో పరిశీలించాలన్నారు.
ALSO Read : పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాలి : విజయేందిర బోయి
అలాగే మంథని పట్టణంలో 100 పడకల ఆసుపత్రి , మున్సిపల్ కార్యాలయం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. వరంగల్– మంచిర్యాల నేషనల్ హైవే నిర్వాసితులకు చెల్లింపు వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఎక్లాస్ పూర్ గ్రామంలోని ప్రైమరీ, జడ్పీ హైస్కూల్, గద్దలపల్లిలో ప్రైమరీ స్కూల్, పీహెచ్‌సీలను సందర్శించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, బోధన పద్ధతులు, మధ్యాహ్న భోజనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈవో మాధవి, ఇతర అధికారులు ఉన్నారు.