ఆర్థిక ఇబ్బందులతో రైతు దంపతుల సూసైడ్​.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

మంథని, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ (35), సంగీత(28)కు ఏడేండ్ల కింద పెళ్లయింది. వీరికి కుమారుడు సాయి (5), కూతురు సాయిసన (4) ఉన్నారు. అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేయగా.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

పంటల కోసం, ఇతర ఖర్చుల కోసం కొంత అప్పు కాగా, ఇంట్లో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగీత సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. ఉదయం కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.