పిల్లర్ల దగ్గరే ఆగిన ఆర్‌‌‌‌వోబీ .. ఏడాదిన్నర అయినా పనులు పూర్తికాలే..

పిల్లర్ల దగ్గరే ఆగిన ఆర్‌‌‌‌వోబీ .. ఏడాదిన్నర అయినా పనులు పూర్తికాలే..
  • రూ.119 కోట్ల అంచనాతో 2022లో పనులు ప్రారంభం 
  • టైంకు బిల్లులు రాక పనులు ఆగినట్లు సమాచారం 
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక జనం ఇబ్బందులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి–కునారం రోడ్డులో చేపట్టిన ఆర్‌‌‌‌వోబీ పిల్లర్ల దగ్గరే ఆగింది. రూ.119 కోట్ల అంచనాతో 2022 డిసెంబర్​లో పనులు ప్రారంభం కాగా ఏడాదిన్నర అయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.  ఒప్పందం ప్రకారం బ్రిడ్జి రెండేండ్లలో పూర్తిచేయాల్సి ఉండగా పనులు స్లోగా సాగుతున్నాయి. బ్రిడ్జికి సంబంధించిన బిల్లులు టైంకు రాకపోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలిసింది.  వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఉమ్మడి వరంగల్‌‌కు తగ్గనున్న దూరభారం 

పెద్దపల్లి–కునారం ఆర్వోబీ పూర్తయితే జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాల మధ్య దూరభారం తగ్గిపోనుంది. పెద్దపల్లి నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లికి ఫోర్​లేన్‌‌ మంజూరైంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్, హుజూరాబాద్​ మీదుగా వరంగల్​ వరకు కూడా ఫోర్​లేన్‌‌ రోడ్డుకు గ్రీన్​ సిగ్నల్​ రావడంతో ఈ ఆర్‌‌‌‌వోబీకి ప్రాధాన్యం పెరిగింది. నిత్యం వేలాది వాహనాలు, లక్షల మంది ప్రయాణికులు ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్‌‌‌‌వోబీ పూర్తికాకపోవడంతో రైల్వే గేట్‌‌ దాటాల్సి వస్తోంది. ట్రైన్ల వచ్చినప్పుడల్లా గేట్‌‌ వేయడం వల్ల గంటలపాటు భారీగా వాహనాలు వేచి ఉండాల్సి వస్తోంది. గేట్ తీసిన తర్వాత వాహనాలు ఒకేసారి పట్టణంలోకి ప్రవేశిస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. 

గంటలకొద్దీ గేటు వేస్తుండడంతో జనం అవస్థలు

ఆర్‌‌‌‌వోబీ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, నామమాత్రంగా పక్కన చిన్నమార్గం ఏర్పాటు చేసి గేటు పెట్టారు. కానీ ఈ మార్గం వెంట గంటకు వేలాది వాహనాలు నడుస్తుంటాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా మార్గం లేకపోవడంతో గేటు దాటే సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్​కు గేటు దగ్గరలో ఉండడంతో స్టేషన్​లో రైలు ఇంజిన్లు మారుస్తుంటారు. 

ఆ టైంలో గేటు పడిందంటే గంట దాకా తీయలేని పరిస్థితి. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. గేటుకు అవతల వైపున ఉన్న గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే టైంకు హాస్పిటల్​కు కూడా తీసుకపోలేకపోతున్నారు. దీంతో గతంలో చాలా మంది గేటు కాడనే  ప్రాణాలు వదిలిన సందర్భాలున్నాయి. ఇప్పటికైనా సర్కార్​ స్పందించి రైల్లే ఓవర్​ బ్రిడ్జీ పనులను వేగవంతం అయ్యేలా చ ర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.