
నస్పూర్, వెలుగు: దేశానికి తెలంగాణ పథకాలు ఆదర్శమని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. ఆదివారం నస్పూర్ లోని బీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీబీజీకేఎస్ కార్యకర్తల ఆత్మీయ సంమ్మేళనంలో ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. తెలంగాణలో గులాబీ జెండా ఉంటేనే బతుకు, భవిష్యత్తు ఉంటుందన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్నారు. గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కేసీఆర్ కృషి వల్లనే వచ్చాయన్నారు.
మంచిర్యాల బాగుపడాలంటే దివాకర్ రావుకు ఓటు వేయాలని కోరారు. మంచిర్యాలలో ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, సింగరేణిలో ఉన్న వారికి పట్టాలు తదితర పనులు చేశామని, కానీ ఇవేవీ కొంత మందికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బాను ప్రసాద్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.