చెకప్ కు తీసుకెళ్తే.. చేతి వేళ్లకు ఇన్ఫెక్షన్

చెకప్ కు తీసుకెళ్తే.. చేతి వేళ్లకు ఇన్ఫెక్షన్
  • పీర్జాదిగూడ మిరాకిల్ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్వాకం 
  • బైఠాయించి ఆందోళనకు దిగిన 
  • బాధిత చిన్నారి కుటుంబసభ్యులు 

మేడిపల్లి, వెలుగు : డెలివరీ అయిన కవల పిల్లలను చెకప్ కు తీసుకెళ్తే డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి చేతి వేళ్లు తొలగించే పరిస్థితికి తెచ్చారని బాధిత తల్లిదండ్రులు వాపోయారు. బాధితులు తెలిపిన మేరకు.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మొండికుంట తండాకు  చెందిన సుధాకర్ నాయక్ భార్య అనిత 25 రోజుల కిందట బోడుప్పల్ పరిధి పీర్జాదిగూడ శ్రీజ హాస్పిటల్ లో డెలివరీ అయింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.

చిన్నారులను మెడికల్ చెకప్ కోసం పీర్జాదిగూడలోని మిరాకిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  25 రోజులుగా చిన్నారులను డాక్టర్లు ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తుండగా.. ఓ చిన్నారికి సెలైన్ ఎక్కించేందుకు చేతి వేళ్లకు గాజు బట్ట చుట్టారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చేతి వేళ్లకు రక్త ప్రసరణ లేక చచ్చుపడ్డాయి.

దీంతో తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు, చిన్నారి చేతి వేళ్లకు ఇన్ఫెక్షన్ సోకిందని, తొలగించాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సుమారు రూ.10 లక్షలు ఫీజు చెల్లించామని, పోలీసులు అధికారులు స్పందించి మిరాకిల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.