పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే భారత్ ఇజ్రాయెల్ నుంచి దాన్ని కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ కోసం డీల్ కుదిరినట్లు చెప్పింది. పెగాసస్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓతో తమకెలాంటీ సంబంధం లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ కథనం సంచలనం సృష్టిస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..
“ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ ఫుల్ సైబర్ వెపన్” పేరుతో న్యూయార్క్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి నివేదిక రూపొందించినట్లు చెప్పింది. ఎన్ఎస్ఓ కంపెనీ దశాబ్దకాలంగా సబ్ స్క్రిప్షన్ విధానంలో నిఘా సంస్థలకు పెగాసస్ ను విక్రయిస్తోంది. భారత్ తో పాటు అమెరికాకు సైతం ఈ స్పైవేర్ ను అమ్మినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం చెబుతోంది. 2017 జూలైలో ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి ఇజ్రాయెల్ పర్యటించారు. నిజానికి ఇజ్రాయెల్ కు వెళ్లిన మొట్టమొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో 200కోట్ల డాలర్లతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, ఆ డీల్ లో భాగంగానే పెగాసస్ ను కూడా విక్రయించినట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలలకు నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. పెగాసస్ డీల్ జరిగిన కొన్నాళ్లకే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా మానవ హక్కుల సంఘానికి అబ్జర్వర్ హోదాను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ కు అనుకూలంగా భారత్ ఓటేసిన విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే దీనిపై కేంద్రం స్పందించలేదు. ఈ నివేదిక పూర్తి నిరాధారమని ప్రభుత్వ ఉన్నతాధికారులు కొట్టి పారేసినట్లు సమాచారం. పెగాసస్ ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసిన సాఫ్ట్ వేర్ అని, అలాంటప్పుడు ప్రభుత్వం ఆ సంస్థతో ఎలా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానిక నిపుణులను సంప్రదించకుండా థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ను ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టంచేసినట్లు సమాచారం.
రాహుల్ సహా పలువురిపై నిఘా
ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ రూపొందించిన పెగాసస్ స్పైవేర్ సాయంతో కొన్ని దేశాలు ఆయా దేశాల్లోని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టాయంటూ గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలు పెద్ద దుమారమే రేపాయి. భారత్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహా దేశంలో 300మంది ఫోన్లను హ్యాక్ చేశారంటూ ది వైర్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై చెలరేగిన వివాదం పార్లమెంటును సైతం కుదిపేసింది. అయితే కేంద్రం మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టేసింది. తాము ఎవరిపై నిఘా పెట్టలేదని ప్రకటించింది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ సుప్రీం కోర్టు పెగాసస్ పై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.