పేలాలతో మైమరిపించే రుచులు

పేలాలతో మైమరిపించే రుచులు

పేలాలు అనగానే మసాలా, భేల్, ఉప్మా, ఉగ్గాణి... ఇవే గుర్తొస్తాయి. కానీ, పేలాలతో మెస్మరైజ్ చేసే వంటలు చాలా ఉన్నాయి. వీటిలో రకాలున్నట్లే ప్రాంతాన్ని బట్టి వెరైటీలూ ఉన్నాయి. ఆ వెరైటీల్లో ముచ్చటగా మూడు రెసిపీలు మీకోసం...


చాక్లెట్ ముర్​మురా 
కావాల్సినవి :
పేలాలు – నాలుగు కప్పులు
చాక్లెట్ – రెండు కప్పులు
బాదం, పిస్తా పలుకులు (వేగించి) – పావు కప్పు
వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
ఒక పాన్​లో పేలాలను వేగించాలి. అందులో వేగించిన బాదం, పిస్తా పలుకులు వేసి కలపాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరో పాన్​లో చాక్లెట్ వేసి, కరిగాక అందులో వెన్న కలపాలి. ఆ తర్వాత పేలాల మిశ్రమంలో చాక్లెట్ మిశ్రమం వేసి బాగా కలిపితే.. చాక్లెట్ ముర్​మురా రెడీ. ఈ మిశ్రమాన్ని నచ్చిన స్టైల్​లో చేసుకుని తినొచ్చు. 

పేలాల అప్పలు
కావాల్సినవి : 
పేలాలు – మూడు కప్పులు
బొంబాయి రవ్వ, నీళ్లు, పెరుగు, క్యారెట్ తరుగు – ఒక్కో కప్పు చొప్పున
ఉప్పు – ఒక టీస్పూన్
నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు – ఒక్కోటీస్పూన్ చొప్పున
ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
మొక్కజొన్న గింజలు – మూడు టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఫ్రూట్ సాల్ట్ లేదా ఈనో – అర టీస్పూన్
తయారీ :
పేలాలను మిక్సీజార్​లో వేసి పొడిచేయాలి. ఒక గిన్నెలో పేలాల పొడి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి పిండిలా కలపాలి. ఆ గిన్నె పై ఒక క్లాత్ కప్పి, 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేగించాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. క్యారెట్, క్యాప్సికమ్ తరుగు, మొక్కజొన్న విత్తనాలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఆ మిశ్రమంతో పాటు కొత్తిమీర తరుగు కూడా పేలాల పిండిలో కలపాలి. ఫ్రూట్ సాల్ట్ లేదా ఈనో వేసి కలపాలి. పొంగనాల పాన్​కి నూనె పూసి, మరమరాల పిండిని పొంగనాల గుంటల్లో పోయాలి. మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. తర్వాత వాటిని తిరగేసి మరికాసేపు ఉడికిస్తే వేడి వేడి పేలాల అప్పలు రెడీ. 

ఖేలోం కె కెబాబ్
కావాల్సినవి : 
పేలాలు – నాలుగు కప్పులు
పెరుగు – ఒకటిన్నర కప్పు
ఉప్పు, నూనె – సరిపడా
పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
పచ్చి బటానీలు (ఉడికించి) – ఒక కప్పు
ఆమ్ చూర్ పొడి – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో పేలాలు, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి  జీలకర్ర వేగించాలి. అందులో పచ్చిబటానీలు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, ఆమ్ చూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొడి వేసి కలపాలి. పేలాల పిండిని తీసుకుని చేత్తో ఒత్తాలి. అందులో బటానీ మిశ్రమాన్ని పెట్టాలి. చివర్లు మూసి, ఉండ చేసి కెబాబ్​లా ఒత్తాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి రెడీ చేసిన కెబాబ్​లను రెండు వైపులా కాల్చాలి.