రెడ్​ బటన్ ​నొక్కితే..వెహికల్స్​ ఆగుతయ్ తెలుసా?

  • సిటీలో నిరుపయోగంగా పెలికాన్​ సిగ్నల్స్
  • అవగాహన కల్పించడంలో ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం
  • 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 70 చోట్ల పెలికాన్ ​సిగ్నల్స్

హైదరాబాద్, వెలుగు : సిటీ రోడ్లపై జీబ్రా క్రాసింగ్​వద్ద ఏర్పాటు చేసిన పెలికాన్​సిగ్నల్స్​నిరుపయోగంగా మారాయి. అవి ఏమిటో తెలియక పాదచారులు ఉపయోగించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించడం లేదు. ట్రాఫిక్​సిగ్నల్స్​ను ఆటోమేటిక్​చేసి వదిలేస్తున్నారు. దీంతో రెడ్​సిగ్నల్​పడిన దాకా పాదచారులు రోడ్డు దాటుతున్నారు. కొన్నిచోట్ల పెలికాన్​సిగ్నల్స్​మొత్తానికే పనిచేయడం లేదు. విదేశాల్లో విజయవంతంగా నడుస్తున్న అధునాత పెలికాన్​ సిగ్నలింగ్​వ్యవస్థను 2023లో హైదరాబాద్ పోలీస్​శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా సిటీలో అందుబాటులోకి తెచ్చాయి.

మూడు కమిషనరేట్ల పరిధిలో 70 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. మొదట్లో వీటిని ఆపరేట్​చేసేందుకు ట్రాఫిక్​వార్డెన్లను నియమించారు. కొన్నాళ్లుగా వారు కనిపించడంలేదు. పెలికాన్​సిగ్నల్స్​ను ఎలా ఆపరేట్​చేయాలో తెలియక జనం వాటిని వినియోగించుకోవడం మానేశారు. రెడ్​సిగ్నల్​పడే వరకు ఆగుతున్నారు. ఒక్కోసారి రెడ్​సిగ్నల్​పడినప్పటికీ వాహనదారులు దూసుకొస్తుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్​బండ్​పై రెండు, మెహిదీపట్నం, పంజాగుట్ట, దిల్​సుఖ్​నగర్, ఖైరతాబాద్, హైటెక్​సిటీ, మాదాపూర్, సరోజినిదేవి కంటి హాస్పిటల్, ఇతర ప్రాంతాల్లో ఈ పెడస్ట్రియన్ సిగ్నల్స్​అందుబాటులో ఉన్నాయి.

ఎలా పనిచేస్తాయంటే..

రద్దీ ప్రాంతాల్లో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఈ పెలికాన్ సిగ్నల్స్ ను తీసుకొచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సిగ్నల్స్​పోల్​వద్ద వీటిని ఏర్పాటు చేశారు. రోడ్డు క్రాస్​చేయాలనుకున్నప్పుడు పెలికాన్​సిగ్నల్ బాక్స్​పై ఉన్న రెడ్​బటన్​నొక్కితే రెడ్​సిగ్నల్​పడుతుంది. సిటీలోని ఏరియాని బట్టి 20 సెకన్ల నుంచి 30 సెకన్ల వరకు రెడ్​సిగ్నల్​పడుతుంది. ఆ గ్యాప్​లో రోడ్డును దాటాల్సి ఉంటుంది. మొదట్లో పెలికాన్​సిగ్నల్స్​ను ట్రాఫిక్​వార్డెన్లు ఆపరేట్ చేశారు.

వాటిని ఎలా ఆపరేట్​చేయాలే జనానికి అవగాహన కల్పించకపోవడంతో పెలికాన్​ సిగ్నల్స్​ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియడం లేదు. చేతులు ఎత్తి వెహికల్స్​ను ఆపాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సిగ్నలింగ్ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రమాదాల శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.