తెలంగాణ హస్తకళలు
చేతి నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను హస్తకళ అంటారు. ఈ హస్తకళల్లో ప్రధానంగా వెండి నగిషీ పనులు, అద్దంక పరిశ్రమ, బీదర్ చేనేత వస్త్రాలు, లేసులు అల్లికలు, బొమ్మలు ఆట వస్తువులు, కంచు ఇత్తడి రాగి వస్తువులు, పూసల పరిశ్రమ మొదలైనవి. భారతీయ హస్తకళల్లో తెలంగాణ చేతి వృత్తులకు విశిష్ట స్థానం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన హస్తకళల గురించి తెలుసుకుందాం.
పెంబర్తిలోహ హస్తకళ
లోహాలను(ఇత్తడి, రాగి, వెండి) రేకులుగా మలచడం పెంబర్తి హస్తకళ ప్రత్యేకత. పెంబర్తిలోహ హస్తకళ ఖండాంతర ఖ్యాతి గడించింది. దేశంలోనే ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం పెంబర్తి. కాకతీయుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం ఉచ్ఛదశకు చేరింది. కాకతీయుల అనంతరం ఈ పెంబర్తి హస్తకళ క్షీణదశకు చేరి ఆసఫ్‌జాహీల కాలంలో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకుంది. పెంబర్తి ఇత్తడి కళ తెలంగాణ వారసత్వ సంపదకు పర్యాయపదంగా నిలుస్తున్నది. పెంబర్తి ఇత్తడి కళా నైపుణ్యం హిందూ ముస్లిం ప్రభావానికి లోనై ఒక లౌకిక కళా నైపుణ్యంగా అభివృద్ధి చెందింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళా ఖండాలు చెక్కే కళ జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో పుట్టింది. ఈ కళ భారతీయుల కాలంలో ప్రజాదరణ పొంది రథాలు, ఆలయాలు అలంకరించేటప్పుడు ఉపయోగించేవారు. చారిత్రిక కట్టడమైన కాకతీయ ద్వారం ఈ పెంబర్తి కళారూపంలో చెక్కారు. మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత ఆలయంలో పెంబర్తి హస్త కళాకృతులు కనిపిస్తాయి. ఈ పెంబర్తి లోహ హస్తకళకు 2010లో భౌగోళిక గుర్తింపు లభించింది.
అయిలాచారి
ఈయన పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన హస్తకళాకారుడు. ఈయన ఆధ్వర్యంలో విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్, ఇండస్ట్రియల్ సొసైటీ(1956) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభ(1975)లకు ఇతని ఆధ్వర్యంలో లోగోలు, షీల్డ్‌లు తయారు చేశారు. తెలుగు సినిమా రంగం అందించే అత్యున్నత పురస్కారం అయిన నంది అవార్డు ప్రతిమను రూపొందించింది అయిలాచారినే .
వెండి నగిషీ పనులు (సిల్వర్ ఫిలిగ్రీ)
లోహాలను తీగలుగా మార్చి వాటికి అద్భుతమైన రూపమివ్వడమే ఫిలిగ్రీ. 200 సంవత్సరాల క్రితం కరీంనగర్‌లోని ఎలగందుల ప్రాంతంలో ఆవిర్భవించింది. సిల్వర్ ఫిలిగ్రీ కళను కడార్ల రామయ్య ప్రవేశపెట్టారు. ఇది పురాతన కాలం నుంచి విశ్వబ్రాహ్మణులు అభ్యస్తిస్తున్న కళ. ఫిలిగ్రీ కళను స్థానికంగా జాలిగా వ్యవహరిస్తారు. కరీంనగర్ వెండి నగిషీ పనులకు ప్రసిద్ధి. నగల పెట్టెలు, ఫ్లవర్‌వాజ్‌లు, చార్మినార్ బొమ్మలు, పక్షులు పుష్పాల ఆకృతులు మొదలైన వాటిపై అతి సున్నితమైన వెండి నగిషీ పనులు ఇక్కడ చేస్తారు. సిల్వర్ ఫిలిగ్రీకి 2007లో భౌగోళిక గుర్తింపు లభించింది.
డోక్రా మెటల్ క్రాప్ట్స్
డోక్రా అంటే బెల్ మెటల్ కళ. డోక్రా అనేది నాన్ ఫెర్రస్ మెటల్ కాస్టింగ్‌తో లాస్ట్ వాక్స్ కాస్టింగ్ టెక్నిక్‌లతో కూడిన హస్తకళ. డోక్రా అనేది ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని ఉషేగావ్ గ్రామంలో తయారు చేస్తున్న పురాతన గిరిజన లోహపు హస్తకళ. మైనపు పద్ధతిని ఉపయోగించి డోక్రా కళాఖండాలు ఇత్తడితో తయారు చేస్తారు. పూర్తయిన కళాఖండానికి ఎలాంటి అతుకులు ఉండవు. ఈ కళలో బొమ్మల తయారీకి ఎర్రమట్టి, మైనం, ఇత్తడి పదార్థాలను ఉపయోగిస్తారు. డోక్రో మెటల్ కళ భారతదేశంలో 4000 సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతోంది. విభజన పూర్వం భారతదేశంలో డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో ఈ కళకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ఈ హస్తకళ కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కెరిమెరి మండలం, కేశలగూడు, జిమ్గావ్, ఉషేగావ్, చిత్తల్బరి గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ కళలో జానపద డిజైన్లు, డోక్రా గుర్రాలు, ఏనుగులు, నెమళ్లు, దీపారాధనలు కొలిచే గిన్నెలు, దేవుడి బొమ్మలు, దీపపు స్తంభాలను ఎలాంటి అతుకులు లేకుండా తయారు చేస్తారు.
బిద్రి వస్తువులు
హైదరాబాద్ బిద్రి వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. నైజాంలో భాగంగా ఉన్న బీదర్‌లో ఈ కళ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం పేరుమీదగానే ఈ కళకు ఆ పేరు వచ్చింది. సుల్తాన్ అమ్మద్ షా ఈ కళను పర్షియా నుంచి ఇండియాకు తీసుకువచ్చాడు. కాపర్, జింకుల మిశ్రమం(గన్మెటల్)తో చేసిన వస్తువులపై మొదట నల్లని రంగు వేసి దానిపై సిల్వర్ లేదా బంగారు రంగులతో డిజైన్స్ వేస్తారు. సిగార్, హుక్కా బలున్స్, ఫ్లవర్‌వాజ్‌లు, నగల డబ్బాలు, అలంకరణ వస్తువుల తదితర ఎన్నో వస్తువులు వీరు తయారు చేస్తారు. బిద్రి కళ ఉత్తర భారతదేశంలోని ముర్షిదాబాద్, లక్నో, పుణె పట్టణాలకు విస్తరించింది.
కొయ్య చెక్కడాలు
తెలంగాణలో యాదాద్రి భూవనగిరి జిల్లా కొయ్య చెక్కడాలు – ఉడ్ కార్వింగ్స్కు ప్రసిద్ధి చెందింది. కొయ్యలు, చెక్కలతో అద్భుతమైన కళా రూపాలను తీర్చిదిద్దడంలో ఈ కళ వ్యక్తమవుతోంది. వివిధ రకాల ఉడెన్ ప్యానల్స్, అలంకరణ వస్తువులు, దేవుడి విగ్రహాలు, ఆర్చీలు, కుర్చీలు ఉడ్ కార్వింగ్‌లు తయారు చేస్తారు.
కంచు ప్రతిరూపాలు
తెలంగాణ రాష్ట్రం కంచు ప్రతిరూపాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. దేవతా విగ్రహాలు, నటరాజ విగ్రహ అంకరణ వస్తువులు హైదరాబాద్‌లో తయారు చేస్తారు. శిల్పారామం ఈ హస్తకళ వస్తువులకు వేదికగా ఉంది.
రఘు దేపాక, సమగ్ర తెలంగాణ పుస్తక రచయిత