జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: విద్యాశాఖలో 317 జీవో బదిలీలపై సర్కారు కొత్తగా ఇచ్చిన సర్క్యులర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులలో కలకలం రేపుతోంది. కేవలం టీచర్లే ప్రభుత్వ ఉద్యోగులా.. ఇతర శాఖల్లో పనిచేసేవాళ్లు కారా.. అని సర్కారును ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది తీసుకొచ్చిన 317 జీవో వల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లోని వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. తమ సొంత జిల్లాలలో కాకుండా మూడు, నాలుగు వందల కి.మీ. దూరంలో ఉన్న జిల్లాలకు బదిలీ అయ్యారు. జిల్లా, జోనల్ స్థాయిలో ఉన్న ఖాళీలను సర్కారు చూపించకుండా, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోకుండానే ట్రాన్స్‌ఫర్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగుల కోసం 317 జీవో తెచ్చి బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం విద్యాశాఖ లోనే ట్రాన్స్‌ఫర్లకు అవకాశం ఇవ్వడాన్ని ఎంప్లాయీస్తప్పు పడుతున్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎలక్షన్లలో వారు తమకు వ్యతిరేకం అవుతారని సర్కారు కొత్త సర్క్యులర్ తీసుకొచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ సర్క్యులర్ ఆధారంగా ఈ నెల 12 నుంచి టీచర్ల బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
నష్టపోయిన వేలాది మంది ఉద్యోగులు
పాత వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులు ఇదే జిల్లాలో పనిచేసేవారు. వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా మార్చిన సర్కారు కాళేశ్వరం జోన్ కింద భూపాలపల్లి, ములుగు జిల్లాలను, భద్రాద్రి జోన్ కింద వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలను చేర్చింది. అయితే హనుమకొండ, వరంగల్ జిల్లా స్థానికులైన కొందరు ఉద్యోగులకు సొంత జిల్లాలలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కొమురం భీమ్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి రిమోట్ ఏరియాలకు బదిలీ చేశారు. జోనల్ స్థాయి పోస్టులు అయితే జోగులాంబ గద్వాల, బాసర వంటి జోన్లకు పంపి వందల కి.మీ. దూరం ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇలాంటివే అన్ని జిల్లాలలోని ప్రభుత్వ ఉద్యోగులకు జరిగింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే భార్యను ఓ జిల్లాలో, భర్తను మరో జిల్లాలో, జోనల్ స్థాయి పోస్టులు అయితే భార్యను కాళేశ్వరం జోన్‌లో వేస్తే భర్తను జోగులాంబ జోన్ కు కేటాయించి ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ జోన్ పరిధిలో పూర్వ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉండేవి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్‌మెంట్‌లో ఈ జోన్ పరిధిలో 147 మంది లైవ్ స్టాక్ అసిస్టెంట్లు ఉండగా ఏ జిల్లాకు చెందినవాళ్లు అదే జిల్లాలో పనిచేసేవారు. వీరిలో ప్రస్తుత 4వ జోన్ పరిధిలో ఉన్న భద్రాద్రి జోన్‌కు 68 మంది లైవ్‌స్టాక్ అసిస్టెంట్లను కేటాయించగా ఇందులో సీనియారిటీ లిస్ట్ ప్రకారం 1 నుంచి 16వ స్థానం వరకు ఉన్న 8 మంది ఉద్యోగులు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో 32 ఖాళీలున్నప్పటికీ హయ్యర్ ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పనిచేయాల్సి వస్తోంది.
ఎదురుచూపుల్లో 15 వేల మంది..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలలో పనిచేయాల్సి వచ్చింది. జిల్లా, జోనల్ స్థాయిలో ఖాళీలున్నా నింపకుండా అన్ని శాఖలలో కలిపి సుమారు 40 వేల మంది ఉద్యోగుల పట్ల సర్కారు కర్కశంగా ప్రవర్తించింది. సీనియారిటీ లిస్ట్‌ను అసలే పట్టించుకోలేదు. గవర్నమెంట్ నియమించిన జోనల్ స్థాయి ఆఫీసర్లు కేవలం రబ్బర్ స్టాంపులుగా మారిపోయారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా, సీనియారిటీ లిస్ట్ ప్రకారం బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ఒక్కో జిల్లాను రెండు, మూడు, నాలుగు, ఐదు కొత్త జిల్లాలుగా మార్చిన సర్కారు 33 జిల్లాలను 7 జోన్లు, రెండు మల్టీజోన్లను చేసింది. అయితే స్థానికత పేరుతో ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ల కోసం తీసుకొచ్చిన 317 జీవోను స్టేట్ ఆఫీసర్లు తమకు ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించారు. సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయించకుండా జూనియర్లను అందలం ఎక్కించారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను చూపలేదు. ఉద్యోగులు ఒప్పుకోకపోయినా, ఆప్షన్లు ఇవ్వకున్నా తమకు నచ్చినట్లుగా ఆర్డర్స్ పాస్ చేసి వెంటనే డ్యూటీలో జాయిన్ కావాల్సిందేనని పట్టు పట్టారు. జోన్ పరిధిలో ఉన్న ఇతర జిల్లాల మారుమూల ప్రాంతాల్లోని వేకెన్సీ పోస్టులకు పంపించారు. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారు. చేసేది లేక భార్య, పిల్లలు, కుటుంబానికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లితండ్రులను, భార్యా పిల్లలను చూసుకోవడానికి వందలాది మంది ఉద్యోగులు లాంగ్ లీవ్‌లు పెట్టారు. ఇటీవల టీచర్ల పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం 317 జీవోపై విద్యాశాఖ బదిలీలకు పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో టీచర్లలాగే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అందరికీ అవకాశం ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో బదిలీల విషయంలో టీచర్లకు అవకాశం ఇచ్చినట్లుగానే ఇతర శాఖల ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలి. 317 జీవో వల్ల వేలాది మంది ఉద్యోగులు వారి సొంత జిల్లాలలో ఖాళీలున్నప్పటికీ ఇతర జిల్లాలలో పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. సరిగ్గా పనిచేయలేకపోతున్నారు.
‒ సురేశ్, టీఎన్‌జీవోస్ , వెటర్నరీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఉద్యోగుల ఆప్షన్లు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త జోన్లను మార్చింది. దీనివల్ల గతంలో పెద్ద జిల్లాలు కాస్త చిన్న జిల్లాలుగా మారిపోయాయి. 317 జీవో ప్రకారం వేలాది మంది ఉద్యోగులను ఎక్కడెక్కడికో ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే జిల్లా, జోనల్ స్థాయి పోస్టుల ఖాళీలను ప్రకటించి ఉద్యోగులను ఆప్షన్ల ద్వారా ట్రాన్స్‌ఫర్లు చేయాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే అన్ని శాఖలకు ఇది వర్తింపచేయాలి.
-
బూరుగు రవీందర్, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షులు, జయశంకర్ భూపాలపల్లి