పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

కరీంనగర్, వెలుగు: వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పనిసరిగా పాటించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ల్యాండ్‌, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతి, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ వెంకటయ్య మాట్లాడుతూ అట్రాసిటీ కేసులకు సంబంధించి బలమైన సాక్ష్యాలు సేకరించి నిందితులకు శిక్షపడేలా చూడాలన్నారు. కోర్టు స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసులపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రివ్యూ చేసి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 

కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు కావాల్సిన బడ్జెట్‌ వివరాలను సమర్పిస్తే ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇస్తామన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ అమలు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించినా,ఇతర కార్యక్రమాలకు మళ్లించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్‌ బాలసదనంలో అనాథ యువతికి వివాహం జరిపించిన కలెక్టర్‌ పమేలా సత్పతిని, జిల్లా సంక్షేమ అధికారి సబితను అభినందించారు. రివ్యూలో అడిషనల్‌ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్‌ దేశాయ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్‌ పాల్గొన్నారు.